ఏపీ రాజధాని తిరుపతి.. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం!!

 

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్  ఏపీ రాజధాని అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతమని, అది దళితుల రక్తంతో తడిసిన ప్రాంతమని అన్నారు. చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే కారణమని, రాజధానిగా అమరావతి ఉన్నంతవరకు వైఎస్ జగన్ కూడా సక్సెస్ కాలేరని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మించే ప్రయత్నం చేయడం వల్లే బాబు ఓడిపోయారని, జగన్ కు కూడా పెద్దగా కలిసిరాకపోవచ్చని అన్నారు. ఏపీ రాజధానిగా తిరుపతి అన్ని విధాలా సరైన ప్రాంతం అని స్పష్టం చేశారు. సీఎం జగన్ అమరావతిని వదిలి తిరుపతికి రావాలని సూచించారు

అంతేగాకుండా, చింతా మోహన్ హైదరాబాదుపైనా స్పందించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. బీజేపీ నేతలు ప్రస్తుతం దీనిపైనే చర్చిస్తున్నట్టు కేంద్ర వర్గాల ద్వారా తనకు రహస్య సమాచారం అందిందని చెప్పారు. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల ముగిశాక హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని చింతా మోహన్ జోస్యం చెప్పారు.