TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు.. కాంగ్రెస్ చింతన్ శిబిర్

Published on: Mon May 16, 2022 7:36AM

కాంగ్రెస్ ఫార్టీ ప్రక్షాళన అన్నది నీటి మీద రాతకు మాత్రమే పరిమితం అన్న సంగతి మరోసారి తేటతెల్లమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యంగా, అందుకు పార్టీకి అవసరమైన కాయకల్ప చికిత్సే ధ్యేయంగా ఉదయ్ పూర్ లో పార్టీ నిర్వహించిన చింతన్ శిబిర్ లో జరిపిన మేధోమథనం.. పార్టీ వైఫల్యాపై చర్చించింది. వైఫల్యాలను అధిగమించి మళ్లీ ప్రజలలోకి వెళ్లాలనీ తీర్మానించింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్ణయాలు చూస్తుంటే కొండను తవ్వినా ఎలుకను కూడా పట్టలేకపోయిన చందంగా ఆ పార్టీ మేథోమథనం జరిగిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీలోనే చింతన్ శిబిర్ నిర్ణయాల పట్ల పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.  అయితే చింతన్ శిబిర్ సాక్షిగా రాహుల్ గాంధీ ఒక వాస్తవాన్నికుండబద్దలు కొట్టినంత సూటిగా చెప్పేశారు. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని. అది వాస్తవమే. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయి దాదాపు పదేళ్లు కావస్తోంది. అందుకే ఆ పార్టీ ఎన్నికలలో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నది. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉన్న జాతీయ పార్టీలలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే  కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపి వారిని పార్టీ విజయానికి కార్యోన్ముఖులుగా నడిపించే నాయకులే కరవయ్యారు.

ఎక్కడికక్కడ నాయకుల మధ్య విభేదాలు, ఒకరినొకరు కిందకు లాగేసే ప్రయత్నాలే ఆ పార్టీ పట్ల ప్రజలలో అసంతృప్తికి కారణమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు ప్రజలతో మమేకం కావడం కంటే.. పార్టీలో అంటే అధిష్టానం వద్ద గుర్తింపునకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. పార్టీలో వర్గ విభేదాల కారణంగా వారిలో వారు విమర్శలు గుప్పించుకోవడానికి, ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేయడానికి పరిమితమౌతూ ప్రజలతో సంబంధాలను కోల్పోయారు. ఆ విషయమే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉదయ్ పూర్ సభలో కుండ బద్దలు కొట్టారు.  ఇది వినా ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నిర్వహించుకున్న చింతన్ శిబిర్ లో చెప్పుకోవడానికేమీ లేదు.

ఒక కుటుంబానికి ఒకే పదవి, ఐదేళ్లకు మించి ఎవరూ పార్టీ పదవులు నిర్వహించరాలు అన్న ప్రక్షాళనా నిర్ణయాలు... మినహాయింపులతో నీరుగారిపోయాయి. గాంధీ కుటుంబానికి వర్తించకుండా ఆ ప్రక్షాళనా నిర్ణయాలలో ఇచ్చిన వెసులుబాట్ల కారణంగా వాటికి ప్రాధాన్యత లేకుండా పోయింది.ఇక  పార్టీని ప్రజలతో మమేకం కావడానికి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నిర్వహించ తలపెట్టిన యాత్ర కాంగ్రెస్ బీజేపీని అనుకరిస్తున్నదన్న భావన కల్పించింది. ఈ యాత్రలో పార్టీ నాయకులందరినీ భాగస్వాములు అవుతారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

అయితే అది ఎంత వరకూ సాకారమౌతుందన్నది పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్న సందేహం. మొత్తంగా ఈ కాంగ్రెస్ నిర్వహించుకున్న చింతన్ శిబిరం పార్టీలోని బలహీనతలను బయట పెట్టుకోవడానికే ఉపయోగపడింది. అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ పగ్గాలను మళ్లీ రాహుల్ గాంధీయే చేపడతారన్న సందేశాన్ని క్యాడర్ కు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ కార్యక్రమాలన్నిటినీ రాహులే ముందుండి నడిపిస్తారని చింతన్ శిబిర్ లో చేసిన నిర్ణయం సారాంశమిందే.