ఆరు నెలల పాటు ఈ ఎం ఐ లు, వడ్డీ లు వసూలు చేయవద్దు: సోనియా గాంధీ

నెలసరి చెల్లింపులు (ఈ ఎం ఐ ) లను ఆరు నెలలు పాటు వాయిదా వేయాలని, అలాగే బ్యాంకులు ఆ ఈ ఎం ఐ లపై వసూలు చేసే వడ్డీ ని కూడా మాఫీ చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రకటించిన 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ను స్వాగతించిన సోనియా, కరోనా వైరస్ పై దాడి లో భాగంగా- కొన్ని ఆర్ధిక, ఆరోగ్య పరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిందిగా ప్రధాని కి విజ్ఞప్తి చేశారు. ఈ ఆపత్కాలం లో జాతి మొత్తం ఒకే తాటి పై నిలబడి, కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి, కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణ సహకారం అందిస్తుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. అలాగే, దినసరి వేతన కార్మికులకు, నరేగా వర్కర్లకు, భవన నిర్మాణ కార్మికులకు, రైతులకు, అసంఘటిత రంగ కార్మికులకు నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.