కర్ణాటక ప్రభుత్వానికి కష్టకాలం?

 

 

కర్ణాటక రాజకీయాలు థ్రిల్లర్ సినిమాని మించిపోయాయి.. ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాకు పూర్తి మెజారిటీ వస్తుందంటే, మాకు పూర్తి మెజారిటీ వస్తుందంటూ బల్లగుద్ది చెప్పాయి.. కానీ రిజల్ట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాయి.. ఓట్లేమో కాంగ్రెస్ కి ఎక్కువొచ్చాయి.. సీట్లేమో బీజేపీ కి ఎక్కువొచ్చాయి.. పూర్తి మెజారిటీ మాత్రం ఎవరికీ రాలేదు.. అయినా బీజేపీ, పెద్ద పార్టీ మాదే అంటూ గవర్నర్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా? బీజేపీకి అధికారం లేకుండా చేయటమే ప్రధాన లక్ష్యంగా జేడీఎస్ తో చేతులు కలిపింది.. బీజేపీకి మెజారిటీ లేదంటూ కోర్టుకెక్కింది.. ఎట్టకేలకు బీజేపీని ఒక్కరోజుకే గద్దె దింపి.. జేడీఎస్ నేత కుమార స్వామిని సీఎం చేసింది.. ఇంతటితో కర్ణాటక రాజకీయాలు కుదుటపడ్డాయి , ఇక సాఫీగా సాగుతాయి అనుకున్నారంతా.

 ఇంతలో మరో ట్విస్ట్.. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కుమార స్వామికి సీఎం కుర్చీ టెన్షన్ మొదలైంది.. పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ౩౦ మంది కాంగ్రెస్ నేతలకి మంత్రి పదవులు దక్కాయి.. ఈసారేమో పూర్తి మెజారిటీ లేకపోవడంతో జేడీఎస్ కి మద్దతిచ్చింది.. అప్పటికీ జేడీఎస్ 8 మంత్రిపదవులే తీస్కొని మిగతావి కాంగ్రెస్ కి ఇచ్చింది.. కానీ మంత్రి పదవి దక్కని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం మాకూ మంత్రి పదవి కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి ఆ నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది.. దాంతో వాళ్ళు శాంతించారు.. ఇక కుమార స్వామి ప్రభుత్వం సాఫీగా సాగిపోతుంది అనుకుంటుండగా ఇంకో ట్విస్ట్.. అసంతృప్తితో ఉన్న సుమారు 40 మంది కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారంట.

 దీంతో అసలు కుమార స్వామి ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అంటూ ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.. ఇదంతా చూసి 'బీజేపీకి అధికారం దక్కకుండా చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడిలా పదవుల కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ.. బీజేపీకి అవకాశం ఇస్తే ఎలా అంటూ.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.. చూద్దాం మరి ఆ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారో?.. పార్టీ గౌరవం ముఖ్యం అంటూ సైలెంట్ అవుతారో, లేక పదవే ముఖ్యమంటూ కుమార స్వామి కుర్చీకి ఎసరు పెడతారో.