ఒక జాతీయ ప్రాంతీయ పార్టీ కథ! 


మన దేశంలో పార్టీలు రెండు , మూడు రకాలు... జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు వగైరా వగైరా. మనం ఏ పేరుతో పిలుచుకున్నా ఒక్క ఎంపీ సీటు సాధించే పార్టీలు మొదలు 273 సీట్లు స్వంతంగా సాధించే పార్టీల వరకూ అన్నీ మన దేశంలో వున్నాయి. అయితే, ఎన్ని వున్నా అతి పురాతన ఇండియన్ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రత్యేకతే వేరు! ఒకప్పుడు అది మాత్రమే జాతీయ పార్టీ. తరువాత ఎన్నో జాతీయ పార్టీలు వచ్చినా తన సత్తా చాటుతూ వచ్చింది. కాని, ఇప్పుడు 44మంది ఎంపీలున్న ఒక జాతీయ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది! ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అదే విశేషంగా, విషాదంగా మారింది...


రామచంద్ర గుహ అనే చరిత్రకారుడు కాంగ్రెస్ పక్షపాతిగా పేరుపడ్డ మేధావి. గాంధీ, నెహ్రులకు వీరాభిమాని అయిన ఆయన నేతాజీ జయంతి సందర్భంగా కోల్ కతాలో మాట్లాడాడు. అక్కడ ఆయన కాంగ్రెస్ గురించి ఏమన్నాడో తెలుసా? 2019లోనే కాదు 2024లో కూడా కాంగ్రెస్ మోదీ సర్కార్ ను ఓడించటం కాని పని అన్నాడు. అంతే కాదు, కాంగ్రెస్ పతనం ఇంకా కొన్నాళ్లు ఆలస్యమవ్వచ్చేమో కాని అది అనివార్యం అని కూడా జోస్యం చెప్పాడు! ఈ మాటలన్నీ అన్నది కాంగ్రెస్ మనిషిగా పేరుబడ్డ వ్యక్తే! బీజేపీ అభిమానో, ఆరెస్సెస్ మద్దతుదారో కాదు... 


రామచంద్ర గుహ చెప్పినట్టు నిజంగానే కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలకు ఒకే రాష్ట్రంలో ఎంపీలు , ఎమ్మేల్యేలు వుంటారు. కాంగ్రెస్ కు కాస్త భిన్నంగా మణిపూర్ నుంచి కర్ణాటక వరకూ దేశ వ్యాప్తంగా అక్కడక్కడా ఎమ్మెల్యేలు , ఎంపీలు వున్నారు. అంతే తేడా. కాని, ఖచ్చితంగా లెక్కవేస్తే అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీల కంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్ద బలంగా ఏం లేదు. పార్లమెంట్లో అయితే కాంగ్రెస్ ది, అన్నా డీఎంకే, టీఎంసీలది ఇంచుమించూ సమాన స్థితి!


అంతకంతకూ కొడగడుతోన్న కాంగ్రెస్ పార్టీకి తాజా నిదర్శనం యూపీలో పొత్తు.దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో 400సీట్లకుగానూ హస్తం పార్టీ పోటి చేస్తోంది 100మాత్రమే! అంటే ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదికి తోకగా వుండటానికి ఒప్పుకున్నట్టే అన్నమాట.సమాన హోదాతో  పొత్తు అయితే రెండు వందల సీట్లకు పైగా కాంగ్రెస్ పోటీ చేయాలి. కాని, అలాంటి పప్పులేం ఉడకవని అఖిలేష్ ఖరాఖండిగా చెప్పేశాడు! అసలు పొత్తే అక్కర్లేదన్నట్టు తన మానాన తాను అభ్యర్థుల్ని ప్రకటించేశాడు. దీంతో ఒంటరి పోరు చేస్తే అసలుకే మోసం అనుకున్న చేయి గుర్తు పార్టీ కాళ్ల బేరానికి వచ్చింది. ప్రియాంక రంగంలోకి దిగి మాట్లాడితే వంద సీట్లకు పొత్తు ఓకే అయింది!


ఒకప్పుడు కాంగ్రెస్ తో ఇతర పార్టీలు పొత్తు పెట్టుకునేవి. ఇప్పుడు కాంగ్రెస్సే వివిధ పార్టీలతో పొత్తుకు తహతహలాడుతోంది. కాంగ్రెస్, లెఫ్టు పార్టీలు బీజేపి తప్ప మిగతా అన్ని పార్టీలతో జత కట్టి కాలం నెట్టుకొస్తున్నాయి. ఈ పొత్తులే లేకపోతే జాతీయ పార్టీలుగా చెలామణి అవుతోన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడో ప్రమాదంలో పడేవి! ఇక క్రమంగా అంతరిస్తోన్న కాంగ్రెస్ దయనీయ పరిస్థితి ఆ పార్టీ నేతల మాటల్లోనే తెలిసిపోతోంది కూడా. ఉత్తర్ ప్రదేశ్ లో పొత్తు వర్కవుట్ కావటానికి ప్రియాంక కారణం అంటూ పెద్ద పెద్ద నేతలు పొగడ్తలు కురిపిస్తున్నారు. గాంధీల కారణంగా అధికారంలోకి రావటం మాట అటుంచి పొత్తులు కూడా అంత ఈజీగా కుదరని గడ్డు కాలం దాపురించింది. రాహుల్ వల్ల ఏమీ అవ్వకపోవటంతో ప్రియాంక రంగంలోకి దిగి అఖిలేష్ ను ఒప్పించిందనేది ఉత్తర్ ప్రదేశ్ లో బహిరంగ రహస్యం!


బీహార్ ఎన్నికల్లో కూడా పైకి బీజేపి ఓడినట్టు కనిపించినా అసలు నష్టం కాంగ్రెస్ కి జరిగింది. అక్కడ కూటమిలో ముఖ్యమంత్రి తాలూకూ పార్టీ అయిన జేడీయూ ప్రధాన పార్టీ. కనీసం రెండవ పార్టీగా కూడా కాంగ్రెస్ లేదు. లాలూ ప్రసాద్ ఆర్జేడీ తరువాతి స్థానంలో కూటమిలో మూడో పార్టీగా సెటిలైంది! రాష్ట్రాల్లో అంతకంతకూ తోక పార్టీగా మారుతోన్న కాంగ్రెస్ ఇక మీదట కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అసాద్యమే. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప కాంగ్రెస్ గత వైభవం తిరిగి సాధించటం సాద్యం కాదు...