TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియా ఆందోళన ఎవరికోసం?

Published on: Wed Aug 13, 2014 11:47AM

 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరభారత దేశంలో మత ఘర్షణలు గణనీయంగా పెరిగిపోయాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ముఖ్యంగా మహారాష్ట్రాలో నానాటికీ పెరుగుతున్న ఈ మతఘర్షణలు తమకు చాలా ఆందోళన కలిగిస్తోందని ఆమె అన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను కులాలు, మతాల వారిగా విడదీసి వారి మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని ఆమె ఆరోపించారు. తమ యూపీయే హాయంలో ఏనాడు దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో మతఘర్షణలు జరిగిన దాఖలాలు లేవని ఆమె అన్నారు. ఈరోజు డిల్లీలో జరుగుతున్నకాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చర్చించి పార్లమెంటులో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ సమావేశంలో తగిన వ్యూహం కూడా సిద్దం చేసుకొంటున్నారు.

 

సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవీ కూడా తమ పాలనలో ఏ కారణంగానయినా అస్థిరత ఏర్పడాలని కోరుకోవనేది అందరికీ తెలిసిన విషయం పదేళ్ళ పాటు మన్మోహన్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేసిన సోనియా గాంధీకి తెలియదనుకోలేము. కానీ, అప్రతిహాతంగా దూసుకుపోతున్న నరేంద్ర మోడీని, ఆయన పార్టీని నిలువరించాలంటే వారిపై ఉన్న మతతత్వ ముద్రనే ఆయుధంగా చేసుకొని అడ్డుకోవాలని కాంగ్రెస్ భావిస్తునందునే సోనియా పదేపదే ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశం దొరకక ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమయ్యారంటూ తనపై, తన కుమారుడుపై పార్టీలో వస్తున్న విమర్శలనుండి తమను తాము కాపాడుకోవడానికే సోనియాగాంధీ తనకు అనువుగా ఉన్న ఈ అంశం ఎత్తుకొని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మత ఘర్షణలపై ఆందోళన చెందడం వలన మాత్రం కాదని చెప్పవచ్చును. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఈ అంశంపై ఇరుకున పెట్టేందుకు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో వ్యూహాలపై చర్చించడం చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.