ఒక్కత్రాటిపైకి వచ్చిన కాంగ్రెస్, తెదేపా నేతలు

 

ఏపీఎన్జీవోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, సమావేశానికి హాజరయిన అన్ని పార్టీల నేతలు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా కలిసి పోరాడేందుకు అంగీకరించారని తెలిపారు. మళ్ళీ శాసనసభ సమావేశమయినప్పుడు బిల్లును వ్యతిరేఖిస్తున్నట్లు సభ్యులందరూ స్పీకర్ కు అఫిడవిట్స్ సమర్పించాలని తాము కోరినట్లు తెలియజేసారు. మళ్ళీ రెండు మూడు రోజుల్లో అందరూ సమావేశమయ్యి రాష్ట్రపతిని కలిసే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ జేఏసీ ఏర్పడలేదు గనుక, జిల్లా స్థాయిలో ఏపీయన్జీవోలే ఉద్యమిస్తారని తెలియజేసారు.

 

తెదేపా నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమైక్యఉద్యమాలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ తరపున హాజరయిన మంత్రి శైలజానాథ్ మరియు యంపీ సబ్బంహరి మాట్లాడుతూ తామందరం కూడా ఉద్యోగ సంఘాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. పార్టీలకతీతంగా అందరూ కలిసి పోరాడితే తప్పకుండా ఫలితం ఉంటుందని వారు అన్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు మరియు సీపీఎం సభ్యులు వీరయ్య మాట్లాడుతూ తాము సమైక్యాంధ్ర కొరకు స్వతంత్రంగానే పోరాడుతామని అన్నారు.

 

ఈ సమావేశంలో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు, రాష్ట్ర విభజనకు అంగీకరించిన తెదేపా సభ్యులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏకాభిప్రాయానికి వస్తే, సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా ఈ సమావేశానికి మొహం చాటేసింది.