టేక్ డైవర్షన్ ప్లీజ్: కాంగ్రెస్ పార్టీ

 

తన ప్రతిష్ట మసకబారిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ప్రజల, ప్రతిపక్షాల, మీడియా దృష్టిని కూడా వెంటనే వేరే అంశం మీదకు మళ్ళించడం అలవాటు. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఓటమి, ముఖ్యంగా డిల్లీలో ఆమాద్మీ చీపురు దెబ్బలతో పూర్తిగా పరువుపోగోట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్ళ క్రితం తను అటకెక్కించేసిన లోక్ పాల్ బిల్లును క్రిందకు దింపి, దుమ్ము దులిపి హడావుడిగా పార్లమెంటు చేత ఆమోదింపజేసింది. ఇది రాహుల్ బాబు చొరవ వలనే జరిగిందని యువరాజావారికి ఆ క్రెడిట్ కట్టబెట్టే ప్రయత్నం కూడా చేసింది. కానీ సభలోనే ఉన్నపెద్ద ముత్తెదువ సుష్మా స్వరాజ్ వెంటనే అడ్డుపడి ఆ క్రెడిట్ అంతా ఈ బిల్లు కోసమే కడుపు మాడ్చుకొంటున్న అన్నాహజారేకే దక్కాలని గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ కంగుతింది.

 

ఇంకా మరో ఆరు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉంది గనుక సమావేశాలను మరికొంత కాలం పొడిగించాలని యువరాజావారు ఆ(దే)శించినప్పటికీ, ‘అవిశ్వాసం..అవిశ్వాసం’ అంటూ సభలో చిందులు వేస్తున్నతమ పార్టీ యంపీల మాటవిని స్పీకర్ అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెడితే, లోక్ పాల్ తో పెంచుకొన్న రేటింగ్ కాస్త మళ్ళీ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంటుందని రాజమాత భయపడ్డారో మరేమో తెలియదు, కానీ ఆమె మనసులో ఆలోచనలని భూతద్దం వేసి చదివేసినట్లు, స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటును నిరవదికంగా వాయిదా వేసేసి చేతులు దులుపుకొన్నారు.

 

ఇక పార్లమెంటులో ఏ కుంభకోణాల గురించి ఎవరికీ జవాబులు, సంజాయిషీలు చెప్పుకొనే ఆగత్యం లేదు గనుక, కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన దేవయాని ఉదంతం అందిపుచ్చుకొని మళ్ళీ హడావుడి చేస్తూ ప్రజల దృష్టి అటువైపు మళ్ళించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే డిల్లీలో అమెరికన్ ఎంబసీ ముందు ఉన్న ట్రాఫిక్ బ్యారికేడ్స్ తొలగించినంత మాత్రాన్నఈ సమస్య పరిష్కారం కాదని దేశముదురు కాంగ్రెస్ పార్టీకి తెలియకపోలేదు. కానీ తెలుగు సినిమాలు హిట్ట్ అవడానికి నాలుగు పంచ్ డైలాగులు ఒక ఐటెం సాంగ్ ఎలా అవసరమో, ఈ ఇమ్మోషనల్ ఇండో-అమెరికన్ డ్రామాతో ప్రజల దృష్టి ఆకట్టుకోవాలంటే ఇటువంటి హడావుడి కూడా అంతే అవసరమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తనకు బాగా తెలిసిన, అలవాటయిన టక్కుటమార విద్యలన్నిటినీ ప్రదర్శిస్తూ అందరి దృష్టి మళ్ళించేందుకు తెగ కష్టపడుతోంది.

 

నిజానికి దేవయాని విషయంలో పరిష్కారం కోసం భారత విదేశంగా శాఖ, అమెరికా విదేశాంగ శాఖా మరియు అమెరికా ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరుపవలసి ఉంది. బహుశః అవి కూడా సమాంతరంగా జరుపుతున్నపటికీ, అది సామాన్య ప్రజల కంటికి కనబడదు గాబట్టి ప్రజలందరికీ అర్ధమయ్యే విధంగా ఈ డ్రామాలు ప్రదర్శిస్తోంది.

 

కాంగ్రెస్ ఊహించినట్లుగానే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా దేవయాని అంశంలోకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు గనుక, వారిని అందులో బిజీ బిజీగా ఉంచుతూనే, మరో పక్క వచ్చేనెల 17నుండి జరగనున్న కాంగ్రెస్ మహాసభలలో రాహుల్ బాబు యువరాజ పట్టాభిషేకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసిన తరువాత ముఖ్యమంత్రుల నియామానికి, పనిలోపనిగా మొన్ననే జైలునుండి బయటకు వచ్చిన లాలూ ప్రసాద్ ను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టెసింది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్నఈ విద్యలపై విద్యార్ధులు పీ.హెచ్.డీ. కూడా చేయవచ్చును.