జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ అందుకే ముందుకి తెచ్చిందా?

 

తెలంగాణాపై గత పదేళ్లుగా ఉద్యమాలు చేసిన తెరాసను చివరికి రాష్ట్ర ఏర్పాటు సాకారం కానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసి మొత్తం వ్యవహారమంతా స్వంత పార్టీ వ్యవహారంగా నడిపిస్తుండటం చూస్తే అది ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్నట్లుంది. విభజనపై నిర్ణయం తీసుకొనే సమయంలోనే కేసీఆర్ ను పక్కనపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆ తరువాత అతనిని దారికి తెచ్చుకొనేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అతను కాంగ్రెస్ తో చేతులు కలపడం కంటే ఒంటరిగా పోటీకి దిగేందుకే సిద్దపడుతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు పంపడంతో, అతనిని నిలువరించేందుకే కేంద్ర మంత్రిని జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపి, అతనిని ముందు ఉంచుకొని ముందుకు సాగుతోంది. తెలంగాణా ప్రజలలో మంచి పేరు, మచ్చలేని చరిత్ర, అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన జైపాల్ రెడ్డిని విమర్శించడం వల్ల తెరాసకు లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించినందునే బహుశః ఆయనని ఆకస్మాతుగా ముందుకి తీసుకువచ్చి ఉండవచ్చును.

 

తన ప్రమేయం లేకుండా డిల్లీలో ఇంత హడావుడి జరుగుతున్నప్పటికీ, తెరాస నోరు విప్పలేకపోవడానికి బహుశః ఇది కూడా ఒక కారణమయి ఉండవచ్చును. బహుశః ఆయనను కాంగ్రెస్ అధిష్టానమే ముందుకు తెచ్చిన కారణంగానే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అనేకమంది టీ-కాంగ్రెస్ నేతలు సామాజికన్యాయం అంటూ ఎంతగా గొంతు చించుకొంటునపటికీ, ఆయన రాకను, అత్యుత్సాహాన్నిఅడ్డుకోలేక చివరికి వ్యవహారమంతా ఆయన చేతుల్లో పెట్టి, ఆయన దర్శకత్వంలో ముందుకు సాగుతున్నట్లుంది.

 

ప్రస్తుతం తెరాస వెనక్కి తగ్గినట్లు కనబడుతున్నపటికీ, అది కేవలం తగిన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. రేపు కేంద్రమంత్రుల బృందం తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేఖంగా  ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అప్పుడు అదే సాకుతో తెరాస జైపాల్ రెడ్డిపై కూడా తన అస్త్ర శాస్త్రాలు ఎక్కుబెట్టవచ్చును.