కాంగ్రెస్ బీజేపీపై జగన్మోహనాస్త్రం ప్రయోగించిందా?

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు కోరుతూ డిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన జగన్మోహన్ రెడ్డికి తాము ఎటువంటి మద్దతు ఈయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఇది పైకి కనబడే ఏనుగు పెద్ద దంతాల వంటిదే. కానీ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య సమావేశమే కీలకమయినది. అందులో తీసుకొన్న నిర్ణయాలే అసలయినవని భావించవచ్చును.

 

ఎందుకంటే, 2014 ఎన్నికల తరువాత ఎలాగయినా కేంద్రంలో అధికారం వశం చేసుకోవాలని తపిస్తున్న బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా చాలా కీలకమే. అటువంటప్పుడు అతను తన సహాయం అర్దించి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా తిరస్కరించలేదు. కానీ తిరస్కరించినట్లు నటించింది అనుకోవలసి ఉంటుంది. అందువల్ల ఆ రెండు పార్టీల నేతల మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఏమి నిర్ణయాలు తీసుకొన్నారనేదే కీలకం.

 

బీజేపీ తను వ్యతిరేఖిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చి, ఆ పార్టీ తెలంగాణాలో మరింత బలపడేలా సహాయపడి, అక్కడ తన పార్టీని తనే దెబ్బ తీసుకొంటుందని భావించలేము గనుక ‘కర్ర విరగ కుండా పాము చావకుండా’ అన్నట్లు బీజేపీ పార్లమెంటులో వ్యవహరించవచ్చును.

 

అయితే, ఇక్కడ మరో ముఖ్యమయిన విషయం తేలవలసి ఉంది. 2014 ఎన్నికల తరువాత జగన్ తనకు మద్దతు ఇస్తాడనే ఉద్దేశ్యంతోనే అతనిని జైలు నుండి బయటకి రప్పించి, రాష్ట్ర విభజనపై దూసుకుపోతున్నకాంగ్రెస్ పార్టీ, జగన్ ఈవిధంగా తన ప్రత్యర్ధులతో రహస్య సమావేశాలవడం, వారిని కూడగట్టి తను చేయబోతున్న రాష్ట్ర విభజనను అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం సహించగలదా? సహిస్తే దానర్ధం అది జగన్మోహన్ రెడ్డినే తన రాజకీయ అస్త్రంగా బీజేపీపై ప్రయోగిస్తోందా?

 

ఇక జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్నరహస్య ఒప్పందం గురించి స్వయంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా చాటింపు వేస్తునప్పుడు, బీజేపీ అగ్రనేతలు జగన్నిఎంతవరకు విశ్వసిస్తారు? తెలంగాణాలో తమ బీజేపీ శాఖ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుకొంటుంటే, అందుకు విరుద్దంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న జగన్ తో బీజేపీ చేతులు కలుపుతుందా? ‘విశ్వసనీయత’ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని బీజేపీ విశ్వసిస్తుందా? అంటే లేదనే చెప్పవచ్చు.

 

కానీ, రాజకీయాలలో ఎవరూ శాశ్విత శత్రువులు కానీ, మిత్రులు గానీ ఉండరనే సిద్ధాంతం ప్రకారం బీజేపీ జగన్మోహన్ రెడ్డితో గౌరవంగా వ్యవహరించి ఉండవచ్చును.