మళ్ళీ కాంగ్రెస్, తెరాసల మధ్య యుద్ధం మొదలవుతుందా

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన వెంటనే మొట్ట మొదట తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి తీవ్ర ప్రయత్నాలు చేసారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అందుకు చాల కృషిచేసారు. అయితే అవి ఫలించకపోవడంతో ఆ తరువాత రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల స్టోరీ కొన్ని రోజులు నడిచింది. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఆ ప్రయత్నాలు కూడా పక్కనపడేసారు.

 

తెలంగాణా సాదించిన ఘనత తమదంటే తమదని ఆ రెండు పార్టీలు చాటింపు వేసుకొంటూ, రానున్న ఎన్నికలలో ప్రజల నుండి ఓట్లు పిండుకోవాలని రెండు పార్టీలు చాలా ఆరాటపడుతున్నాయి. అయితే ఇంత కాలం టీ-కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకొని కూర్చోవడంతో ఇదే అదునుగా తెరాస నేతలు ఈ ఘనత అంతా తమకే చెందుతుందని గట్టిగా చెప్పుకోగలిగారు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ నిర్వహించి తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినట్లయితే తెరాస పూర్తి మెజార్టీ సాధిస్తుందని తేల్చి చెప్పింది.

 

ఈ సర్వే నివేదికపై తెరాస నేత ఈటెల రాజేందర్ స్పందిస్తూ, తెలంగాణాలో మొట్టమొదట తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పరచబోతోందని, తమది భౌగోళిక తెలంగాణ ఎజెండా కాదని, తెలంగాణ పునర్నిర్మాణ ఎజెండా అని అన్నారు.

 

ఇది సహజంగానే టీ-కాంగ్రెస్ నేతలలోగుబులు పుట్టించింది. ఇంకా దీమాగా చేతులు ముడుచుకొని కూర్చొంటే ఇక ఆ తరువాత చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గ్రహించి ఈ రోజు నుండి పదిరోజుల పాటు పది తెలంగాణా జిల్లాలో జైత్రయాత్రలు మొదలుపెట్టారు. తెలంగాణా ఏర్పాటులో ఇక వెనకడుగు వేసే ఆలోచన లేదని కాంగ్రెస్ అధిష్టానం కూడా ధృడసంకల్పంతో ఉన్నందున వారి జైత్ర యాత్రకు అనుమతిచ్చేసింది.

 

ఈ రోజు నిజామాబాద్ జిల్లా భోధన్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్రలో దాదాపు టీ-కాంగ్రెస్ నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ.శ్రీనివాస్ తెరాస నేతలను ఉద్దేశ్యించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాక్యాలు చేసారు.

 

“తెలంగాణాలో చిన్నచిన్న పార్టీలు కూడా తామే తెలంగాణా రాష్ట్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెపుతున్నాయి. కానీ తెలంగాణా రాష్ట్రం సాధించిన కాంగ్రెస్ పార్టీయే ఆ కీలక బాధ్యత కూడా చేపడుతుంది. ఆ సత్తా కేవలం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే ఉంది.” రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మ్రోగించి మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పరిచి, తెలంగాణా పునర్నిర్మాణం చేపడుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.

 

మరి తెరాసను విలీనం చేసుకోవాలని, లేకపోతే కనీసం ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెరాస అవసరం లేకుండానే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొంటామని చెప్పడం చూస్తే, మళ్ళీ కేసీఆర్ కాంగ్రెస్ నేతలని తిట్లు లంఖించుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇంతవరకు తెలంగాణా ఇస్తున్నందుకు సోనియాగాంధీని పొగుడుతున్న తెరాస నేతలు, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీయే మొదట ప్రభుత్వం ఏర్పాటుచేయాలని సిద్దపడితే ఇక మళ్ళీ తెరాస నేతలు తమ తిట్ల పురాణం తెరుస్తారేమో.