కాంగ్రెస్ కపట వైఖరి

 

ఇంతవరకు సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు టీ-నోట్ ఆమోదం పొందేవరకు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతూ వచ్చేరో, అదేవిధంగా ఇప్పుడు ‘రానున్నఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగదు’, ‘శాసనసభలో బిల్లును అడ్డుకొంటాము’, ‘న్యాయ పోరాటం చేస్తాము’, నేను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరుగదు’, ‘పార్టీ కంటే ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం’ అని ముఖ్యమంత్రితో సహా సీమంధ్ర కాంగ్రెస్ నేతలు పలుకుతున్నచిలుక పలుకులు కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకే.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్నిఎంత దిక్కరిస్తున్నట్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అడ్డుతగులుతున్నట్లు వ్యవహరిస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు గట్టిగా చెప్పగానే రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులను, కేవలం రెండే రెండు సమావేశాలతో చల్లార్చివేయగలిగారు. (దేవుడే పంపినట్లు పైలాన్ తుఫాన్ కూడా సమయానికి వచ్చి అందుకు సహాయపడింది.) అందుకే కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రమశిక్షణ గల నాయకుడని దిగ్విజయ్ సింగ్ పొగుడుతారు. ప్రదేశ్ సమన్వయ కమిటీలో కిరణ్ కుమార్ రెడ్డి సభ్యత్వం మళ్ళీ రెన్యువల్ అవుతోటుంది.

 

ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితిని మెల్లగా అదుపులోకి తెస్తూనే మరో వైపు రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా సమాంతరంగా ముందుకు నడిపిస్తోంది. అయితే మెల్లగా ముందుకు కదులుతూనే అసలు నిలుచున్నా చోట నుండి అంగుళం కూడా ముందుకు కదలనట్లు కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా నటించేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే దిగ్విజయ్, షిండే, చాకో నిత్యం మీడియా ముందుకి వచ్చి ఒకరికొకరు పొంతనలేని మాటలు మాట్లాడుతూ,అసలు కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుందా లేదా? అనే అయోమయ పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఒకరు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసేస్తామని అంటే మరొకరు మంత్రుల బృందం పని కానిచ్చేందుకు నిర్దిష్ట సమయం ఏమీ లేదని చెపుతూ రాష్ట్ర విభజన ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్నట్లు మాట్లాడుతారు.

 

అదేవిధంగా ఇక్కడ సీమాంధ్రాలో తన నేతల చేత కూడా పరస్పర విరుద్దమయినా మాటలు, రోజుకొక రకమయిన వాదనలు చేయిస్తూ ప్రజలలో గందర గోళం సృష్టిస్తూ, మరో వైపు మెల్లగా తన పనికానిస్తోంది. శాస్త్రీయంగా, సామరస్య వాతావరణంలో జరుపవలసిన విభజన ప్రక్రియను ఇటువంటి కపటమయిన పద్దతిలో చేస్తోంది. ఇందుకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్వయంగా ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. అయినా తన ఏర్పాట్లు తను ముందే చేసుకొంది గనుక దైర్యంగా, చాటుగా ముందుకు సాగుతోంది.