అంతా అయోమయ విభజన

 

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న కుప్పిగంతులు చూస్తే చాలా నవ్వు వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం నేతలు ఒకరికొకరు పొంతన లేని మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల ప్రజలలో మరింత చులకన భావం కలిగిస్తున్నారు. నిన్న సోనియా గాంధీ కార్యదర్శి విభజన ప్రకటన చేయడంలో తొందర పడ్డామని అభిప్రాయం వ్యక్తం చేస్తే, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ సీమాంధ్ర నేతలతో మాట్లాడుతూ అంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే టీ-నోట్ కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు.

 

కానీ, ఈ రోజు హోంమంత్రి షిండే రంగ ప్రవేశం చేసి, ఆరోగ్యకారణాలతో తను ఇంతకాలంగా కార్యాలయానికి రాలేనందునే టీ-నోట్ పరిశీలించలేకపోయాయని, ఈ రోజు పరిశీలించి క్యాబినెట్ సమావేశంలో సమర్పిస్తానని అన్నారు. ఇక, వివిధ పనులతో, కారణాలతో పలువురు మంత్రులు బిజీగా ఉన్న కారణంగా రద్దయిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ రేపు ఉదయం నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం.

 

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడం అయితే చేసింది గానీ, దానిని సజావుగా ఏ విధంగా పూర్తి చేయగలదో దానికే అర్ధం కాకుండా ఉంది. కనీసం ఇప్పటికయినా తన రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించడం మాని, ఉభయ ప్రాంతాలకు చెందిన తన పార్టీ నేతలతో ఈవిషయంపై సమగ్రంగా చర్చించి, అందరినీ ఒప్పించుకోగలిగినా అడుగు ముందుకు వేయగలదు. లేకుంటే రానున్న ఎన్నికలలో ఇరుప్రాంతలలో ఘోర పరాభవం తప్పదు.

 

తాజా సమాచారం: సీమాంధ్రా యంపీలు, కేంద్ర మంత్రులు ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశం కానున్నారు. మరి ఈ సారి ఆయనేమి కొత్త మాట చెపుతాడో చూడాలి.