పేదవాడి పెన్నిధి.

 

congress, cm kiran kumar reddy, sonia gandhi, ap congress

 

.......Vijaykumar Ponnada
 

 

దేశంలో పెదవాళ్ళకి మా చెడ్డ కరువొచ్చినట్టుంది. వీళ్ళు రోజురోజుకీ తగ్గిపోతున్నారుట. అంటే డైనాసర్లులాగా, కొన్ని సంవత్సరాలకి పేదవాళ్ళు కూడా అంతరించిపోయే ప్రమాదం వుంది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వానికి తెలియకుండానే, వీరి శాతం తగ్గిపోతోందిట. ఔరా! ఎంత పని జరిగింది.


 

అదేదో టెండూల్కర్ నివేదికటండి. దాని ప్రకారం మన రాష్ట్రంలో పేదవాళ్ళు 9 శాతం మాత్రమే వున్నారుట. పాపం ప్రభుత్వానికి ఈ విషయం తెలియక, ప్రపంచ బ్యాంకుని నమ్ముకుని, రాష్ట్రంలో జనాభాతో పేదలు కూడా పెరుతారని ప్రఘాడ విశ్వాసంతో, 2017-18 సంవత్సరానికి ఇప్పుడున్న 21 శతాన్ని 12 శాతానికి తగ్గించాలని ప్రణాలిక వేసుక్కూర్చుంది. తీరా చుస్తే ఇప్పుడే దానికన్న తక్కువున్నారుట. ఏమిటి సాధనం? ఇదేదో పరువు పోయేట్టుగావుంది. తక్షణం ఏదోకటి చేయాలి. లేక పోతే లేనివి వున్నట్టు చూపిస్తున్నామన్న చెడ్డపేరొచేస్తుంది. అసలు రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళున్నారో ఓ మారు లెక్కెట్టి చూసి, ఆపైన ప్రాణాలిక వేసుకునుంటే బాగుండేది. ఇక బుర్ర బద్దలుకొట్టుకుని లాభంలేదని తలచి, ఎలాగయినా వున్నఫళంగా పేదవాళ్ళ శాతం 21 కి పెంచి, వేసుకున్న ప్రణాలికకి అనుగుణంగా, వారిని 12 కి తగ్గించాల్సిందే అని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవాళ్ళకోసం వేట మొదలెట్టింది.

 



ముందస్తుగా తమ ఆస్తి వివరాలు బహిర్గతం చేసిన ఎమ్మెల్యేల జాబితా తెప్పించి పరిశీలించింది. ఆశ్చర్యంగా 295 మంది పేదవాళ్ళు ఇట్టే దొరికేసారు. అందరూ కూడా ఆస్తిపాస్తుల్లేని వాళ్ళే. వెంటనే వాళ్ళని పేదవాళ్ళ సంఖ్యకి కలిపేసింది. అయితే పేదవాళ్ళ శాతం 0.90 మాత్రమే పెరిగింది. 'చా! మనకి ఓ పది శాసన సభలుంటే ఎంత బాగుండేది ' అని వాపోయి, మళ్ళీ ఆలోచన్లో పడింది. ఇంకా బోల్డుమంది కావాలి. ఇప్పుడుకిప్పుడు పేదవాళ్ళని తయ్యారు చేయటమంటే, ప్రణాలిక తయ్యారు చేసినంత సుళువేం కాదు. అందుకే పేదవాళ్ళని దిగుమతి చేసుకునే కార్యక్రమం చేపట్టింది.

 


కార్యక్రమం క్రమంగా వున్నా, కార్యం ఎలా సాధించాలాని ఆలోచనలో పడింది ప్రభుత్వం. మన రాష్ట్రంలో కన్నా ఎక్కువగా పేదవాళ్ళు వున్న రాష్ట్రాలకి వెళ్ళి, అక్కడున్న పేదవాళ్ళని బతిమాలో, బామాలో మన రాష్ట్రాలకి తెచ్చుకుంటే, తగ్గిన శాతాన్ని బర్తీ చేయచ్చు. అందుకే, మన ప్రభుత్వ పధకాలని, వాటికి సంబంధించిన ప్రయోజనాలని అక్కడ పెదవారికి తెలియచెప్పి, వారిని మన రాష్ట్రానికి వలస తెచ్చే పనికోసం, మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి పంపింది.



వారు ఒక రాష్ట్రానికి వెళ్ళి మన పధకాలని ఏకరువు పెట్టారు. కానీ అక్కడ మన 'నేటివిటీకి ' తగ్గట్టుగా లేరు. చాలా బలిష్టంగా, కండలు పెంచి వస్తాదుల్ల వున్నారు. తీరా ఆరా తీస్తే, వారు అక్కడ ఎమ్మెల్యేలు  అని తేలింది. హడలిపోయి మరో రాష్ట్రానికెళ్ళారు. అక్కడా మనకి కావలసిన వాళ్ళు దొరకలేదు. అలా ఎడారిలో నీళ్ళకోసం అన్వేషించినట్టు, అన్ని రాష్ట్రాలు తిరిగి, ఆఖరికి ఓ రాష్ట్రంలో కొంతమందిని వెదకి పట్టుకున్నారు. కానీ, అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు అస్సలు లేరు. పోనీలే భాష నేర్పిస్తే పోలే అని, మళ్ళీ మన పధకాలని ఎకరువు పెట్టారు. ఆ పేదవాళ్ళని మన రాష్ట్రానికి వలస రమ్మని ప్రాదేయ పడ్డారు. 'అబ్బే, ఇంతకన్నా ఎక్కువే ఇక్కడ మాకు ముడుతోంది, అక్కడకొచ్చి కొత్తగా పులుముకునేది ఎముంది కనుక,' అని వీల్లేదు పొమ్మన్నారు. దొరక్క దొరక్క దొరికారు. అలా వాళ్ళని వదిలేస్తే, మరో నాల్రోజుల్లో గొప్పవాళ్ళయ్యిపోయే ప్రమాదం వుందని, మళ్ళీ ఈ సారి ప్రాధేయపట్టంతో పాటు, కాళ్ళ మీద కూడా పడ్డారు. ఇక వాళ్ళకి చిరాకేసి, కాళ్ళు విడిపించుకుని, కుర్చీపైనెట్టేసుకుని, 'సరే, ఇంతకన్న ఎక్కువిస్తే వస్తాము ' అన్నారు. ఇప్పటికే అమ్మ హస్తము, నాన్నా కాలూ అని బోల్డు పధకాలు పెట్టినా, ఇంకా కావాలనే సరికి, మన వాళ్ళకి కోపం వచ్చి, 'చస్! మీ దిక్కున్న చోటుకి పొండి ' అని తిరిగొచ్చేసారు.  


  


ఇంటికొచ్చేసి, పెట్టే బేడా దించేసి, కాస్త కునుకు తీద్దమనేసరికి, సీయం దగ్గరినుంచి కబురొచ్చింది. ఇలా జరిగినది చెప్పేసరికి, ఆయన మండి పడి, 'దొరికిన వాళ్ళని వదలి వచ్చేసారా? ఎంత పని చేసారు. ఇవాళ వెదక్కుండానే కుందేటి కొమ్ము ఇట్టే దొరుకేస్తోంది కానీ, పేదవాళ్ళు దొరకటం ఎంత కష్టమో మీకు తెలియటంలెదు. పేదవాడి విలువ మీకేంతెలుసు? నెలకి మీ జీతాలు మీకు వచ్చేస్తాయి. పాపం వాళ్ళ గురించి ఆలోచించండి.' అనే సరికి, వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగొచ్చిన యావత్మంది భోరున ఏడ్చేసారు. 'వెళ్ళండి, వాళ్ళు కోరినట్టుగా మరి కాస్త ఎక్కువిస్తామని బుజ్జగించి తీసుకురండి.' అన్నారు, సీయం.



అంతే, దించిన పెట్టే బేడా మళ్ళి తలమీదెట్టుకుని, ఆ రాష్ట్రానికి పరుగులంకించారు. అక్కడ ఎవ్వరు కనిపించలేదు. ఏక్కడికెళ్ళారు చెప్మా అని వుప్మా తింటూ వాళ్ళ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. అక్కడేవున్న ఓ ముసలి పేదవాడిని అడిగారు, మొన్న మేము మాట్లాడి వెళ్ళిన వారంతా ఏరనీ? ఆ ముసలాడు వీళ్లని ఎగా దిగా చూసి, 'వాళ్ళు ఇంకా ఇక్కడే ఎదుకుంటారు. మొన్న మీరెళ్ళకా, వేరే రాష్ట్రం వారొచ్చి, వాళ్ళ రాష్ట్రానికి పేదవాళ్ళు కావాలని వీళ్ళకి ఏదికావాలంటే అదిస్తామని చెప్పి తీసుకుపోయారు.' అన్నాడు.