కాంగ్రెస్ తో కాంగ్రెస్ యుద్ధం

 

రాష్ట్ర విభజన కంటే దానిపై వివిధ రాజకీయ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నవివాదస్పద వ్యాఖ్యలే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. మొన్న కేసీఆర్, నిన్న ముఖ్యమంత్రి మళ్ళీ ఆయనకి జవాబుగా టీ-కాంగ్రెస్ మరియు తెరాసా నేతలు వరుస పెట్టి చేస్తున్న ప్రసంగాలు అగ్నికి ఆజ్యం పోస్తుంటే, వాటిని చల్లార్చే ప్రయత్నం చేసే బదులు దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే వంటి వారు ఆ మంటలను మరింత ఎగదోస్తున్నారు.

 

ఒకప్పుడు కేవలం తెలంగాణకే పరిమితమయిన ఆ మంటలు ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించాయి. ఈ మంటలను రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల కంటే అధికార కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా పెంచి పోషిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి క్లిష్టమయిన సమస్యను పరిష్కరించడానికి పూనుకొన్నపుడు ముందుగా తన రాష్ట్రనేతలని పూర్తిగా కట్టడి చేసి ఉండి ఉంటే సమస్య తీవ్రత చాలావరకు తగ్గి ఉండేది. కానీ, కాంగ్రెస్ పార్టీలోఎవరినీ ఎవరూ కట్టడి చేయలేరని ఆ పార్టీ నేతలు నేడు నిరూపిస్తున్నారు.

 

విభజనకు అనుకూలంగా కొందరు, వ్యతిరేఖంగా మరి కొందరు ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ మాట్లాడటం దీనికి పరాకాష్ట అనుకొంటే, ఆయనపై టీ-కాంగ్రెస్ నేతలందరూ యుద్దానికి దిగడం ఆ పార్టీలో క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలియజేస్తోంది. అధిష్టానానికి విధేయులమని ప్రకటించుకొనే కాంగ్రెస్ నేతలు అందరు ఈ విధంగా ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడుతూ సమస్యని పెంచిపోషిస్తున్నారు.

 

బహుశః దీనినే కాంగ్రెస్ మార్క్ పాలన అంటారేమో మరి. కాంగ్రెస్ నేతల చెలరేగిపోతున్న తీరుచూస్తే, ఈ వాద ప్రతివాదాలు, ఒకరినొకరు దూషించుకోవడం వగైరా డ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగామేనేమో? అని ప్రజలు అనుమానించే పరిస్థితి కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు రాష్ట్ర విభజన అంశంలో వ్రేలు పెట్టేందుకు ఎటువంటి అవకాశం ఈయకుండా ఉండేందుకే ప్రతిపక్ష పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ తమ నేతల చేతనే పోషింపజేస్తున్నట్లు కనబడుతోంది.