TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ తవ్వుకొన్న గోతిలో తనే పడబోతోందా?

Published on: Thu Nov 28, 2013 9:59AM

 

తెలంగాణా ప్రజలను, నేతలను సంతృప్తిపరచి ఉద్యమాలను చల్లార్చి తిరిగి రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలనే సదుద్దేశ్యంతోనే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం వినసొంపుగానే ఉంది. అయితే అది ఆ పని రెండు మూడేళ్ళ క్రితమే చేసి ఉంటే నిజంగా నమ్మశక్యం ఉండేది.

 

రేపు ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉన్నకాంగ్రెస్ పార్టీ, తను తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీ మద్దతు ఇస్తే తప్ప పూర్తి చేయలేని ఈ పనిని ఎందుకు తలెకెత్తుకొని ఆయాసపడుతోందో అందరికీ తెలుసు. సరే! ఇంత కష్టపడుతున్నాఅది ఆశించిన ఫలితాలయినా పూర్తిగా పొందగలుగుతుందా అంటే అదీ అనుమానమే.

 

తెలంగాణా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయలేదని ఇప్పటికే కొంత స్పష్టం అవుతోంది. హైదరాబాద్, భద్రాచలం, హైదరాబాద్ ఆదాయంలో సీమంద్రాకి వాటా, ఉద్యోగాలు వంటి అనేక అంశాలలో వారికి ఆగ్రహం కలిగించే నిర్ణయాలు కొన్నితీసుకోక తప్పదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటువేస్తారు? తెరాస ఎందుకు మద్దతు ఇస్తుంది?

 

ఇక కేసీఆర్ మొదట తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఒప్పుకొన్నా,ఇప్పుడు మాట మార్చి కనీసం పొత్తులకి కూడా అంగీకరించకపోవడం చూస్తే, తెరాస వలన కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండబోదని అర్ధం అవుతోంది. వచ్చేఎన్నికల తరువాత కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంటే దాని నుండి పూర్తిప్రయోజనం పొందాలనే ఆలోచనతోనే బహుశః కేసీఆర్ తన మనసు మార్చుకొని ఉండవచ్చును.

 

ఇక తన సీమాంధ్ర నేతల భవిష్యత్ పణంగా పెట్టి మరీ ఆడుతున్న ఈ రాజకీయ జూదంలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదు. పార్టీకి అత్యంత విదేయులయిన వారినందరినీ కాదనుకొని, మొండిగా, అనుమానాస్పదంగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవడం మరో విచిత్రం.

 

అతనిదీ, తమ కాంగ్రెస్ డీయన్.యే. అని , అతను తన కొడుకు వంటి వాడని దిగ్విజయ్ సింగ్ చెపుతుంటే, అతను కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో దేశాటన చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముకొని తన పార్టీ నేతలని బలిపెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ అది వైకాపాను, జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉండకపోతే, సీమాంధ్రలో తన పార్టీని బలిపెట్టేది కాదు గదా! 

 

కాంగ్రెస్ అధిష్టానం ఇదే పనిని అతని తండ్రి చనిపోయిన నాడే చేసి ఉండి ఉంటే, పరిస్థితులు వేరేలా ఉండేవేమో! కానీ అప్పుడు దూరం చేసుకొని సమయం కాని సమయంలో ఇప్పుడు అతనిని చంకనెత్తుకోవాలని ప్రయత్నిచడం మరో పెద్ద చారిత్రిక తప్పిదం కావచ్చును. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ బోటాబోటి సీట్లు సాధిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు లభిస్తుందా? అతను మద్దతు ఈయకపోతే మాత్రం ఏమి చేయగలదు?

 

కాంగ్రెస్ తలచినదొకటయితే జరుగుతున్నదీ, జరుగబోయేది వేరొకటి. ఒకవేళ ఈ వ్యవహారంలో ఎక్కడయినా రాజ్యాంగానికి విరుదంగా ఒక్క అడుగు పడినా సుప్రీం కోర్టు కనుక జోక్యం చేసుకొంటే ఉన్న పరువు కూడ కోల్పోవడం ఖాయం. ఒకవేళ ఎలాగో కష్టపడి విభజన చేసినా పైన చెప్పుకొన్న కారణాల వలన అటు తెలంగాణాలో ఇటు సీమాంధ్రలో చావు దెబ్బ తినడం కూడా ఖాయం.

 

తనది ఒక కన్ను కోల్పోయినా పరువాలేదు,కానీ ఎదుట వాడివి రెండు కళ్ళు పోవాలనే కాంగ్రెస్ దురాలోచనే ఈ అనర్ధానికంతటికీ మూల కారణం.