తెలంగాణపై నిర్ణయం కోసం కాంగ్రెస్ ఎందుకు తొందరపడుతోంది

 

తెలంగాణా అంశం ఇక క్లైమాక్స్ కి వచ్చేసినట్లేనని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మీడియా కూడా తీర్మానించేయడమే కాకుండా, జూలై 12వ తేదీని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అంటూ ముహూర్తం కూడా ఖరారు చేసేసాయి. 12వ తేదీన జరిగే కోర్ కమిటీ సమావేశానికి హాజరవమంటూ ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడుకి కాంగ్రెస్ అధిష్టానం కబురు పెట్టడం, దిగ్విజయ్ సింగ్ తెలంగాణా విద్యార్ధులకు మిఠాయిలు పంచిపెట్టి త్వరలో శుభవార్త వింటారని హామీ ఇవ్వడం, ఇవ్వనీ తెలంగాణా సూచికలేనని అందరూ ఘంటాపధంగా చెపుతున్నారు.

 

అయితే ఇంత కాలంగా తెలంగాణ అంశం నానుస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ మారగానే వారం పదిరోజుల్లోనే అనేక పీటముడులు పడిఉన్న తెలంగాణా సమస్యను ఒక కొలిక్కి తెచ్చేయాలని ప్రయత్నించడం చాలా ఆశ్చర్యకరమయిన విషయమే, కానీ తెలంగాణా ఏర్పాటుకి ఇప్పుడు కృతనిశ్చయంతో ఉన్నట్లు మాత్రం అర్ధం అవుతోంది. అందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. రాష్ట్రంలో ఒక్క స్వంత పార్టీ నేతలు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా ఏర్పాటుకి అంగీకరించడం, ఎన్నికలు తరుముకు వస్తుండటం. ఇక సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకే సీమంధ్ర కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన సమైక్యాంధ్ర సభలకు, సమావేశాలకు ఎప్పుడు ఏవిధంగా ఫుల్ స్టాప్ పెట్టించాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు గనుక వాటి గురించి కాంగ్రెస్  దిగులుపడటం లేదు.

 

ముఖ్యంగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు, మెజారిటీ లోక్ స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ముందుగానే చేస్తున్నఎన్నికల సన్నాహంగా దీనిని చూడవచ్చును. ఒకవైపు తెరాసను, మరో వైపు జగన్ మరియు తెదేపాలను ఎదుర్కొని ఎన్నికలలో విజయం సాదించడం అసాధ్యమని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణా ప్రకటనతో ఒక దెబ్బకు మూడు పిట్టలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసేయడం అసాధ్యమని అందరికీ తెలుసు. అనేక సంక్లిష్టమయిన అంశాలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజన చేయడం వలన ఊహించని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలియకపోలేదు. అయితే, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు గనుక కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటనకు మానసికంగా సిద్దపడుతోంది.

 

ప్రస్తుతానికి ఏదో ఒక సానుకూల ప్రకటన చేసి, ఎన్నికల గండం గట్టెక్కిన తరువాత మిగిలిన అంశాలను మెల్లగా చక్క బెట్టుకోవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. ఎన్నికలకు ఇంకా 9నెలలు గడువు ఉన్నందున, రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణాలో తనకు పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పరుచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ అమలుచేయవచ్చును.

 

అందువల్ల ఇక కాంగ్రెస్ అధిష్టానం మూడు విషయాలపై తన దృష్టి కేంద్రీకరించవచ్చును.

 

1.తెరాసను విలీనం చేసుకోవడం లేదా తెలంగాణాలో ఆ పార్టీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించివేయడం.

 

2.జగన్ మోహన్ రెడ్డి పార్టీని విలీనం లేదా పొత్తులు పెట్టుకోవడం లేదా అతనిని సీబీఐ కేసులలో మరింత బిగించడం.

 

3.రాష్ట్ర విభజన ప్రక్రియతో తెదేపాను రెండు ప్రాంతాలలో బలహీన పరచడం.

 

అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక ముందు తీసుకొనే ప్రతీ నిర్ణయమూ కూడా ఈ మూడు అంశాల ఆధారంగానే ఉంటుంది.