ప్రత్యర్ధి పార్టీలలో చీలికకు వేసిన కాంగ్రెస్ ఎత్తు ఫలిస్తోందా

 

ఒకవైపు తెలంగాణావాదులు ఇక నేడో రేపో ప్రత్యేకరాష్ట్రం ఏర్పడటం ఖాయమనే భరోసాతో రోడ్డు మ్యాపులు తయారు చేసుకొంటే, మరోవైపు సమైక్యాంధ్ర కోసం మళ్ళీ రాజీనామాల పర్వం మొదలయింది. ఆదివారం కడపలో జరిగిన సమైక్యాంధ్ర జేఏసీ సమావేశానికి హాజరైన వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, బత్తుల పుల్లయ్య తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ ఫార్మట్‌లో సమైక్యాంధ్ర జేయేసీ నేతలకు అందజేశారు. అదేవిధంగా తేదేపాకు చెందిన శాసనసభ్యుడు లింగారెడ్డి కూడా రాజీనామాకు సిద్దమేనని ప్రకటించారు. తెదేపాకి చెందిన నేతలు మాజీ మంత్రి బ్రహ్మయ్య ,గోవర్దనరెడ్డి, అమీర్ బాబు తదితరులు కూడా ఈ అఖిలపక్ష సమైక్యాంధ్ర జేఏసీ సమావేశానికి హాజరయ్యారు. ఇక మరో విశేషమేమిటంటే, ప్రత్యేక తెలంగాణకు మొదటి నుండి మద్దతు తెలుపుతున్న సిపిఐ పార్టీ నేతలలో కూడా చీలిక వచ్చినట్లు కనబడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు కూడా కొందరు ఈ సమావేశానికి హాజరవడం విశేషం.

 

అయితే, తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తరువాత ఆ పార్టీకి చెందిన సమైక్యాంధ్ర నేతలు కొంచెం వెనక్కి తగ్గారు. ఇటీవలే చంద్రబాబు తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేఖం కాదని విస్పష్టంగా ప్రకటించారు కూడా. ఇటువంటి నేపద్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు మళ్ళీ సమైక్యవాదం నినాదం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించబోతోంది.

 

అదేవిధంగా ఇంత కాలం రాష్ట్ర విభజనపై నోరు మెదపని వైకాపాకి, సరిగ్గా పంచాయితీ ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో ఆపార్టీ నేతలు ఇప్పుడు సమైక్యాంధ్ర నినాదం చేయడం తెలంగాణా ప్రాంతంలో ఎదురు దెబ్బ కావచ్చును.

 

‘పదిరోజుల్లో తెలంగాణా’ అంటూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల కోసమే ఈ కొత్త నాటకం మొదలుపెట్టిందని తెరాస చేస్తున్న ఆరోపణలు నిజమనుకొంటే, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, వైకాపాలను ఇరుకునబెట్టి త్వరలో జరగనున్న పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలలో విజయం సాదించేందుకే వేసిన ఈ ఎత్తు ఫలిస్తున్నట్లే కనబడుతోంది. ఒకవేళ అదే నిజమయితే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలలో తాత్కాలికంగా పైచేయి సాధించి ఈ ఎన్నికలల గెలిచే అవకాశం ఉన్నపటికీ, ఇది స్థానిక ఎన్నికల కోసమే వేసిన ఎత్తని స్పష్టమయినప్పుడు, ఆ పార్టీ తెలంగాణా ప్రజల నమ్మకం పోగొట్టుకొని, రానున్న సాధారణ ఎన్నికలలో తీవ్రంగా నష్ట పోక తప్పదు. అయితే, కాంగ్రెస్ అంత పెద్ద తప్పిదం చేస్తుందని అనుకోలేము.

 

ప్రస్తుతం ఈ పంచాయితీ ఎన్నికలు గడిచేవరకు ఈ రోడ్డు మ్యాపు సమావేశాలు, చర్చ డ్రామాలు కొనసాగించినప్పటికీ, ఆ తరువాతయినా రాష్ట్ర విభజనపై విస్పష్టమయిన ఒక ప్రకటన చేయక తప్పదు.

 

ఇప్పటికే, తన సీమంద్రా నేతలందరికీ కేంద్ర మంత్రి పదవులిచ్చి దారికి తెచ్చుకొన్న కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన కొద్ది మందిని కూడా త్వరలోనే దారికి తెచ్చుకోగానే ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేయవచ్చును. అప్పుడు దానిని తెదేపా, వైకాపాలు ఇదివరకులా వ్యతిరేఖించే పరిస్థితి లేదు గనుక ప్రకటన తరువాత ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చును. ఒకవేళ తెదేపా, వైకాపాలు తమ పార్టీ నేతలను అదుపులో పెట్టుకోలేక, వారు ఇప్పటిలాగే సమైక్య నినాదం చేసి అడ్డంకులు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ దానివల్ల రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం తప్పక చేస్తుంది.