కాంగ్రెస్ ఓటమి ఖాయమంటున్న జీవన్ రెడ్డి
Published on: Sat Mar 10, 2012 1:21PM
హైదరా
బాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఆపార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటుంటారు. అంతర్గత ప్రజాస్వామ్యంతోపాటు బహిర్గత ప్రజాస్వామ్యం కూడా ఆపార్టీలో చాలా ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రకటనలు చేసేస్తుంటారు. ఆ ప్రకటన పార్టీకి ఎంత నష్టం కలిగించినా వారేమీ భయపడరు. ఇప్పుడు తెలంగాణాలో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి కూడా ఇటువంటి ప్రకటనలే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులందరూ పరాజయం పాలవడం ఖాయమని అంటున్నారు. తెలంగాణా సెంటిమెంట్ మాత్రమే ఈ ఎన్నికల్లో గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం అర్ధంకావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడేనిమిది రోజులు సమయం ఉన్నందువల్ల కాంగ్రెస్ అధిష్టానం వెంటనే మేల్కొని ప్రత్యేక తెలంగాణా ఇచ్చేస్తామంటూ ప్రకటన చేయాలని ఆయన కోరారు. సోనియాగాంధీ అటువంటి ప్రకటన చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తెలంగాణా ప్రాంతంలో రంగంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధులు మండిపడుతున్నారు. మరో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా జీవన్ రెడ్డి వంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంవల్ల ఓటర్లలో చులకనైపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


