TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికలకు సిద్దమవుతున్న తెల్లం, ముదునూరి

Published on: Sat Mar 3, 2012 10:01AM

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ కు వీర విధేయులైన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఉప ఎన్నికకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ విప్ ను ఉల్లంఘించినందుకు వీరిపై ఇప్పటికే వేటు పడింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా గత వారం రోజులుగా పర్యటిస్తున్నారు. ఒక దశలో జిల్లానుంచి నలుగురు ఎమ్మెల్యేలు జగన్ శిబిరంలో చేరారు. అయితే కాంగ్రెస్ పెద్దలనుంచి వచ్చిన ఒత్తిడి కిరణ్, ప్రభుత్వం నుంచి వచ్చిన హామీతో ఇద్దరు జగన్ వర్గంనుంచి మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. ఫలితంగా నర్సాపురం, పోలవరం శాసనసభ్యులు మాత్రం జగన్ శిబిరంలోనే మిగిలిపోయారు. ఈ ఇద్దరు నాయకులు ఉప ఎన్నికల్లో తిరిగి విజయకేతనం ఎగురవేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కూడా ఇప్పటికే ఉప ఎన్నికలు జరుగుతాయనుకుంటున్న నియోజక వర్గాల్లో సర్వేలు నిర్వహించినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రజాధరణ, బలాలు, బలహీనతలు, ప్రధాన ప్రత్యర్ధి ఎవరు కాబోతున్నారు అనే అంశాలతో ఈ సర్వే సాగినట్లు సమాచారం. పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలరాజు జగన్ శిబిరంలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలేవరూ ఆయన వెంట వెళ్లలేదు. ఇది పార్టీకి కొంత ప్రతికూలంగా మారవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి నర్సాపురంలో కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఓట్లు చీలడం ఖాయంగా కనిపించడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగురవేయడానికి చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయన నర్సాపురం నియోజకవర్గంలో రైతు పోరు యాత్ర చేశారు. ఈ యాత్ర ఆ ప్రాంతంలో విజయవంతమైంది. పోలవరంలో కూడా గెలుపు గుర్రాన్ని ఎంపికచేసే పనిలో ఉన్నారు. పోలవరంలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అభ్యర్ధుల పేర్లను ఆ పార్టీ పరిశీలించింది. మాజీ ఎమ్మెల్యే సింగన్నదొర ఈసారి తన కుమారుడికి అవకాశం కల్పిస్తే విజయావకాశాలు మెరుగవుతాయని చంద్రబాబుకి భరోసా ఇస్తున్నారు. మాగంటి బాబు కూడా ఒక అభ్యర్ధిని చంద్రబాబుకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది.