జగన్ ఎమ్మెల్యేలపై 'వేటు'కు వెనకడుగు
Published on: Sun Feb 12, 2012 8:39AM
హైద
రాబాద్: కాంగ్రెస్ ధిక్కార ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోగా జగన్ వర్గానికి చెందిన 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అనుకున్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు జగన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కండువాలతో సభకు హాజరుకావాలని వారు నిర్ణయించారు. అలాగే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందున సభలో తమకు ప్రత్యేక స్థానాలు కేటాయించాలంటూ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. అనర్హత వేటు వాయిదా వేయాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వర్గానికి కొంత బలం చేకూరినట్లయిందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా జగన్ వర్గానికి చెందిన 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్లయితే మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
ప్రస్తుత పరిస్థితిలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల ఉప ఎన్నికలకు వెళ్ళడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టమే తప్ప లాభం ఉండదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అనర్హత వేటు వాయిదా వేయడమే మంచిదని వారు భావిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో కొందరు మళ్ళీ కాంగ్రెస్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అటువంటప్పుడు వేటుపై తొందరపడి నిర్ణయం తీసుకోరాదని అనుకుంటున్నారు. అనర్హత నిర్ణయం శాసనసభ స్పీకర్ పరిధిలోనిదే అయినప్పటికీ కాంగ్రెస్ శాసనసభ్యుడైనందున అధిష్ఠానం చెప్పినట్టు నడుచుకోవలసి ఉంటుందని, స్పీకర్ స్థానంలో ఏ పార్టీకి చెందిన వారు ఉన్నప్పటికీ ఇది తప్పనిసరి పరిస్థితిగా మారిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.


