యూపీలో కాంగ్రెస్ గాలి
Published on: Fri Feb 10, 2012 8:32AM
అమే
థీ: కాంగ్రెస్ యువనేత్రి ప్రియాంక గాంధీ అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు ఎన్నికల సభల్లో ప్రసంగించిన ప్రియాంక రాష్ట్రంలోని బిఎస్పీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తోందని ఆమె స్పష్టం చేశారు. 22 ఏళ్ళ కాంగ్రెసేతర పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి అడుగంటిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాలు, పార్కుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రియాంక విరుచుకుపడ్డారు. యూపి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు రాబోతోందని జోస్యం చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని పక్కనబెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు మాయ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ‘ప్రభుత్వ నిధులు నాయకుల కోసం కాదు. అవి సగటు మనిషికి చెందాలి. పార్కులు, విగ్రహాలకు ప్రజాధనం వెచ్చించే హక్కు ఎవరికీ లేదు. యూపి ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసింది’ అని ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘మీరు వేసే ప్రతి ఓటూ మీ భవిష్యత్‌కు ఉపయోగపడాలి. వచ్చే ఐదేళ్ళు మంచి పాలన అందించే అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వండి’ అని ఎన్నికల సభలో ప్రియాంక పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మార్పు కోసం రాహుల్ పడ్డ శ్రమ ఫలిస్తుందని ప్రియాంక స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రచారంలో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన వారణాశిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ను కాంగ్రెసు పార్టీ అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లిందని అన్నారు. కాంగ్రెసుకు అవకాశమిస్తే ఎపిలాగే ఉత్తర ప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే విస్తుపోతున్నాయన్నారు. ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా విదేశీ నిరుద్యోగులు హైదరాబాద్ వస్తున్నారని అన్నారు.


