టీకాంగ్రెస్ లో రచ్చబండ రచ్చ.. రేవంత్ ను అడ్డుకోవడమే సీనియర్ల లక్ష్యమా?
Published on: Mon Dec 27, 2021 2:44PM
సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ ఉన్న ఎర్రవల్లిలో వరి సాగుపై టీపీసీసీ తలపెట్టిన రైతుల రచ్చబండ కార్యక్రమం... తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ రాజేసింది. కేసీఆర్ సొంత గడ్డలోనే గర్జించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తే.. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రివర్స్ అటాక్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాటల తూటాలు పేల్చుతున్నారు. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, విభేదాలు మరోసారి బయటపడేలా చేసింది.
తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో CM కేసీఆర్ దత్తత గ్రామం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో రైతులతో రచ్చబండ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు రేవంత్ రెడ్డి. అయితే పీసీసీ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా కార్యక్రమం తలపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యనేతలతో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రిసెడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీ.హనుమంతరావు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తనకు సమాచారం లేకుండా తన ఇలాకాలో రచ్చబండ ఏంటని ప్రశ్నించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అంతేకాదు ఆ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణలో పార్టీకి నష్టమని.. దీనిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తాననని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన జగ్గారెడ్డిని సీనియర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిందంట్లో తప్పేంటన్నారు సీనియర్ నేత వీ. హనుమంతరావు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు సమాచారం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నపుడు పార్టీలో అందరితో చర్చించాలి కదా అని వీహెచ్ ప్రశ్నించారు. ఈ ఇష్యూపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో మాట్లాడుతానంటున్నారు వీహెచ్.
రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో తలపెట్టిన రైతుల రచ్చబండ అధికార పార్టీలో గుబులు రేపింది. అయితే రేవంత్ ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేయడం టీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. ఇదే అదనుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కారు పార్టీ నేతలు. పీసీసీ అధ్యక్షుడికి సొంత పార్టీలోనే మద్దతు లేదని మెదక్ జిల్లా MLC యాదవరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తమ ఉనికిని కాపాడుకునేందుకే రచ్చబండ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వల్లే పోలీసులు అనుమతి ఇవ్వలేదని యాదవరెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపగా.. అది నిరుగారేలా సీనియర్లు నేతలు వ్యవహరిస్తున్నారనే చర్చ గాంధీభవన్ లో సాగుతోంది.


