73 కాదు 77.. కాదు కాదు 93.. ఇంతకూ ఆ బోట్ లో వెళ్ళింది ఎంత మంది?

 

గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా, కొంత మందిని కాపాడగా, మరి కొంత మంది ఆచూకీ ఇప్పటికి తెలియని పరిస్థితి. ప్రమాదం జరిగిన రోజు నుండి ప్రభుత్వం చెపుతున్న వివరాల ప్రకారం 73 మంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐతే నిన్న రాష్ట్ర మంత్రి కన్నబాబు ఈ దుర్ఘటన పై వివరణ ఇస్తూ ఆ బోటులో మొత్తం 77 మంది పాపికొండల పర్యటన కోసం వెళ్లినట్లు తెలిపారు. ఐతే తాజాగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఇచ్చిన వివరణలో 75 మంది మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో బోటు ప్రమాదం నుంచి బయటపడిన తిరుపతికి చెందిన మధులత అనే మహిళ ఆ రోజు బోటులో 85 మందిపైనే ఉంటారని చెప్పారు. ఐతే తాజాగా మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇదే విషయం పై మాట్లాడుతూ మొత్తం 93 మంది పర్యాటకులు ఉన్నారని, ఆ బోటు బయలుదేరే ముందు ఫోటోలు తీసిన లోకల్ పోలీసులు వాటిని రిలీజ్ చేస్తే ఇదే విషయం స్పష్టమౌతుందని అంటున్నారు. దింతో అసలు ప్రభుత్వం వద్ద దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదని తమ ఆప్తులను కోల్పోయిన బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు మిస్సింగ్ లిస్ట్ పెరుగుతూ పోతోందని విమర్శలు వస్తున్నాయి.