TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పొత్తులపై ఏపీ బీజేపీలో అయోమయం.. క్లారటీ ఇవ్వని అధిష్ఠానం!

Published on: Tue May 17, 2022 7:56AM

ఏపీ బీజేపీలో తీవ్రమైన అయోమయం, గందరగోళం నెలకొని ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగాలు ఆ గందరగోళాన్ని, అయోయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం  ఏపీ గురించి అసలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎన్నికల వేడి తారస్థాయిలో ఉన్న వేళ.. బీజేపీలో గందరగోళం ఆ పార్టీ కేడర్ నే కాదు.. నాయకులను సైతం తికమక పెడుతోంది. ఏపీలో ఇప్పుడు పొత్తులపై చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించేశారు.

అలాగే ప్రధాన విపక్షం కూడా వైసీపీని గద్దె దింపి, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని, త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ఇప్పటికే పొత్తు ఉన్న బీజేపీ మాత్రం తన వైఖరి ఏమిటన్న విషయంలో తికమత ప్రకటనలతో, అయోమయపు సూత్రీకరణలతో వాతావరణాన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ పొత్తు జనసేనతో మాత్రమేనని ప్రకటించారు. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ అమరావతి సందర్శించి.. మూడు రాజధానుల ఊసే లేదు.. అమరావతే ఏపీ రాజధాని అని ప్రకటించి.. తెలుగుదేశం విధానాలను సమర్థిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఈ నేపథ్యంలో  బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ఆ పార్టీతో కనిపించడం లేదు. సోము వీర్రాజు ప్రకటనలపై స్పందించడం లేదు.  అలాగే జనసేన నేతలెవరూ బీజేపీతో కలవడం లేదు. జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ ఏకపక్షంగా చేస్తున్న ప్రకటనలకు స్పందన పవన్ కల్యాణ్ నుంచి కానీ, ఆయన పార్టీ నుంచి కానీ రావడం లేదు. అయినా పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవలసినంది బీజేపీ అధిష్టానం కానీ, సోము వీర్రాజు కాదన్న వాదన మాత్రం జనసేనలో అంతర్గతంగా సాగుతోంది.

 దీంతో ఈ పొత్తులపై ఢిల్లీ నేతలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్  మొదటి వారంలో జేపీ నడ్డా ఏపా పర్యటన ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటనలో నడ్డా ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఓట్లు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఓటుబ్యాంకే లేని బీజేపీతో పొత్తుకు అవకాశాలు మృగ్యమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో నడ్డా రాష్ట్ర పర్యటనలో పొత్తలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి వైసీపీ  మద్దతు కీలకం కావడంతో బీజేపీ ఓటూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉందని అంటున్నారు. అందుకే బీజేపీ తన వైఖరి ఏమిటన్నది రాష్ట్రపతి ఎన్నిక తరువాత వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. పొత్తుల విషయంలో బీజేపీ తన వైఖరిని మార్చుకోకుంటే రాష్ట్రంలో ఏకాకిగా మిగలక తప్పదని కూడా విశ్లేషిస్తున్నారు.