రాజీవ్‌గాంధీ హత్య జరిగిన చోట.. కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే.. కూటమిలో కుంపట్లు
Published on: Tue Mar 22, 2022 4:13PM
విషాద జ్ఞాపకమే అయినా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు చరిత్రలో నిలిచిపోయే, పట్టణం. ఇక్కడే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని, తమిళ టైగర్లు పొట్టన పెట్టుకున్నారు. ఈ పట్టణంలోనే రాజీవ్‌గాంధీ స్మారక స్థలి వుంది. ఆ విధంగా శ్రీపెరుంబుదూరు పట్టణం ఒక విషాద సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా చరిత్రలో నిలిచి పోయింది. అయితే, ఇప్పుడు అదే శ్రీపెరుంబుదూరు పట్టణ పంచాయతీ విషయంలో, సమాచారలోపం వల్లనే కావచ్చును, కాంగ్రెస్, డిఎంకేల మధ్య వివాదం చోటు చేసుకుంది. చివరకు, రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ జోక్యం చేసుకోవలసి వచ్చింది.
విషయంలోకి వెళితే, తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ మిత్ర పక్షాలు గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేశాయి. విజయం సాధించాయి. అదే క్రమంలో ఇటీవల జరిగిన నగరపాల, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికల్లోనూ,డిఎంకే కూటమి, ఘన విజయం సాధించింది. ఉభయ పార్టీల మధ్య కుదిరిన, ఒప్పందం ప్రకారం కాంగ్రె్‌సకు శ్రీపెరుంబుదూరు పట్టణ పంచాయతీ అధ్యక్షపదవిని కేటాయించారు. ఆ పట్టణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన సెల్వమేరీని అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలంటూ డీఎంకే తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. కానీ చివరి క్షణంలో డీఎంకే సభ్యులు అధిష్టానవర్గం నిర్ణయాన్ని వ్యతిరేకించి శాంతిని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శ్రీపెరుంబుదూరు పట్టణ పంచాయతీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికైనవారు వెంటనే రాజీనామా చేసి తప్పుకోవాలని, ఎన్నికల ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ఉత్తర్వు జారీ చేశారు. కొందరు వార్డు సభ్యులు పార్టీ ఆధేశాలను పాటించినా అధ్యక్షురాలిగా ఎన్నికైన డీఎంకే నగరశాఖ అధ్యక్షుడు సతీ్‌షకుమార్ సతీమణి శాంతి మాత్రం ఇంకా తన పదవికి రాజీనామా చేయలేదు. ఈ వివరాలన్నీ కాంగ్రెస్ అధిష్టానవర్గం దృష్టికి వెళ్ళాయి.
ఈ నేపధ్యంలో స్థానిక ఎన్నికల ఒప్పందం ప్రకారం శ్రీపెరుంబుదూరు పట్టణ పంచాయతీని పొందటానికి టీఎన్‌సీసీ నేతలు చర్యలు చేపట్టాలని ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారక స్థలి ఉన్న శ్రీపెరుంబుదూరు పట్టణ పంచాయతీ పాలనా బాధ్యతలు కాంగ్రె్‌సకు ఉంటేనే సముచితంగా ఉంటుందని సోనియాగాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ దిశగా డీఎంకే అధిష్టానవర్గంతో మళ్ళీ చర్చలు జరిపి శ్రీపెరుంబుదూరు పట్టణ పంచాయతీ పాలన బాధ్యతలు కాంగ్రె్‌సకు లభించేలా చేయమంటూ ఆమె టీఎన్‌సీసీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందా, లేక జటిలంగా మారుతుందా అనేది చూడవలసి వుంది.


