TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోశాలలో కామ్రేడ్ నారాయణ

Published on: Wed Apr 16, 2025 3:44PM

ఇటీవలి కాలంలో వార్తలలో నిలిచిన ఎస్వీ గోశాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం (ఏప్రిల్ 16) పరిశీలించారు. తిరుమల తిరుపతి  దేవస్థానానికి చెందిన ఎస్వీ గోశాలలో నెలల వ్యవధిలో వందల గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను టీటీడీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు అయితే వాస్తవానికి గోవుల దాణా బొక్కేసింది కరుణాకరరెడ్డి హయాంలోనే అని ప్రత్యారోపణలు కూడా చేశారు. కరుణాకరరెడ్డి హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అవకతవకలన్నిటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఆలా టీటీడీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించారు.

గోశాలలో ఆవుల ఆరోగ్య పరిస్థితులు, వాటికి అందుతున్న దాణా తదితర అంశాలను నిశితంగా పరిశీలిం చారు. అనంతరం టీటీడీ ఎస్వీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఇసుమంతైనా లేదని చెప్పారు. గోవులకు దాణా కొరత లేదనీ, నిత్యం గోవుల ఆరోగ్యాన్ని పశువైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని నారాయణ చెప్పారు. గోశాలలో గోవులన్నీ పుష్ఠిగా ఉన్నాయన్న ఆయన  టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయనీ, ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టడం దారుణం అన్నారు..

కమిషన్ల కక్కుర్తితో హరినాథరెడ్డి గోవులను విక్రయించారని నారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పుడు గోశాల నిర్వహణ బ్రహ్మాండంగా ఉందని ప్రశంసించారు. గోశాలను తన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవడం సరి కాదని నారాయణ అన్నారు. అసత్య, అవాస్తవ ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని నారాయణ అన్నారు. ఇక తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లను అందిం చడాన్ని నారాయణ స్వాగతించారు. అలాగే శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచినందుకు టీటీడీపై ప్రశంసల వర్షం కురిపించారు.