కోడెల ఇంట్లో చోరీ.. వైసీపీ వ్యక్తి పని!!

 

టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన సత్తెనపల్లి నివాసంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. విద్యుత్ మరమ్మతులు చేయాలంటూ ఇంట్లోకి ప్రవేశించి కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ విషయంపై కోడెల స్పందించారు. తన నివాసం నుంచి కంప్యూటర్లు ఎత్తుకెళ్లింది గుంటూరు వైసీపీ కార్యాలయంలో పనిచేసే అర్జున్ అని, దీనిపై డీఎస్పీకి కూడా సమాచారం అందించానని వెల్లడించారు. అర్జున్ గతంలో తమవద్ద పనిచేశాడని, ఇప్పుడు అంబటి రాంబాబు వద్ద ఉన్నాడని తెలిపారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అంబటి దీనిపై ఏమంటారని కోడెల నిలదీశారు. అతడు తన ఇంట్లోని కంప్యూటర్‌ పరికరాలను ఎందుకు తీసుకెళ్లాడో, అతడి వెనుక ఎవరున్నారో తనకు తెలియాలని కోడెల అన్నారు. అధికార పార్టీ తనపై కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కోడెల ఆరోపించారు. 

తన నివాసంలోని ప్రభుత్వ ఫర్నిచర్‌ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న వార్తలను కోడెల ఖండించారు. అసెంబ్లీలో ప్రతి వస్తువుకు లెక్క ఉంటుందని చెప్పారు. కొందరు వ్యక్తులు, మీడియా సంస్థలు.. ఫర్నిచర్‌ చోరీ, దుర్వినియోగం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయలేదని ముందే చెప్పానని, ఫర్నిచర్‌కు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని కోడెల స్పష్టం చేశారు.