TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం రహిత గ్రామంగా పెద్దమాసానపల్లి.. ప్రజల ఏకగ్రీవ నిర్ణయం

Published on: Thu Jun 4, 2026 5:27PM

 

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పెద్దమాసానపల్లి గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధి, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, గ్రామస్థులందరూ దీనికి పూర్తి మద్దతు ప్రకటించారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా లేదా మద్యం సేవించినా వారిపై రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు గ్రామ పంచాయతీ హెచ్చరించింది.

అంతేకాకుండా, గ్రామంలో మద్యం విక్రయాలు లేదా మద్యం సేవించే వారి గురించి సమాచారం అందించిన వారికి రూ.1,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు.

గ్రామాన్ని మద్యరహితంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు. పెద్దమాసానపల్లి గ్రామస్తుల ఈ వినూత్న నిర్ణయంపై స్థానికులు, సామాజిక వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మద్యపానం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక సమస్యలను తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు.