ఈసీ వెబ్ సైట్‌లో ప్రధాని మోదీపై ఫిర్యాదు మాయం

 

కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని మోదీపై నమోదైన ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో మాయం కావడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశాడు. అయితే దానిపై దర్యాప్తు పూర్తికాకుండానే వెబ్‌సైట్ నుంచి ఆ ఫిర్యాదును తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఈసీ సాంకేతిక సమస్యల కారణంగా తప్పు జరిగిందని ప్రకటించింది.

మహారాష్ట్ర లాతూర్‌లో జరిగిన ర్యాలీ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటును పుల్వామా అమరవీరులు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సైనికులకు అంకితమివ్వాలని కోరారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నది కోల్‌కతాకు చెందిన మహేంద్రసింగ్ అనే వ్యక్తి మోదీపై ఏప్రిల్ 9న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఈసీ మహారాష్ట్ర ఎన్నికల అధికారిని వివరణ కోరింది. అయితే ఆయన నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాకముందే ఈసీ వెబ్‌సైట్‌లో పరిష్కారమైందంటూ ఫిర్యాదును తొలగించింది.

ఫిర్యాదు పరిష్కారమైందంటూ ఈసీ వెబ్ సైట్‌లో చూపడంపై మహేంద్రసింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో ఈసీ క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని సమర్థించుకుంది. ఫిర్యాదుపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, మహారాష్ట్ర ఎన్నికల అధికారికి దాన్ని బదిలీ చేశామని ప్రకటించింది. అయితే ఫిర్యాదు చేసి రెండు వారాలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంపై మహేంద్రసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదుచేసిన తర్వాత కూడా మోదీ తన ప్రసంగాల్లో పలుమార్లు పుల్వామా, బాలాకోట్ అంశాలు ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.