కేసీఆర్-కేజ్రీవాల్.. ఇద్దరు సీఎంలదీ ఒకటే రూట్...
Published on: Wed Apr 6, 2022 3:00PM
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్’కు తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్’కు మధ్య ఏదైనా సంబంధం, ఏవైనా పోలికలు ఉన్నాయా అంటే, రాజకీయ విశ్లేషకులు ఉన్నాయనే అంటున్నారు. ఇద్దరి మధ్య స్పష్టమైన గుణగణ సారుప్యతలు చాలానే ఉన్నాయని, ఇద్దరూ తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తులని, ఇద్దరినీ ఎరిగిన విజ్ఞులు విశ్లేషిస్తున్నారు. అయితే ఎవరి అడుగు జాడల్లో ఎవరు నడుస్తున్నారు, అనేది కొంచెం చాలా చిక్కు ప్రశ్న అని కూడా విజ్ఞులు అంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం అయితే చెప్పనే అక్కర్లేదు, దళిత ముఖ్యమంత్రి మొదలు దలిత బంధు వరకు, వరి సాగు విషయంలో, ఎంత పండిస్తే అంత ‘హ్యాపీ’ గా కొంటాం అంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన మొదలు గింజ కూడా కొనేది లేదని అదే అసెంబ్లీ ప్రకటించడం వరకు, ఆయన ద్విముఖాభిప్రాయం వ్యక్త చేసిన సందర్భాలు, అన్నమాట అనలేదన్న సందర్భాలు అనేకం ఉన్నాయని, ఆ విద్యలో శ్రీ కేసీఆర్ సిద్ధహస్తులని అంటారు. సోషల్ మీడియా అలాంటి విన్యాసాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆయన అప్పుడు ఏమన్నారు, ఇప్పడు ఏమంటున్నారు పక్క పక్కనే చూపించి, సోషల్ మీడియా ఆయన ద్విముఖాభినయాన్ని చూపిస్తూనే వుంది.
అలాగే, అసలు సమస్యను పక్కదారి పట్టించి ప్రజల కళ్ళు కప్పడంలోనూ శ్రీ కేసీఆర్’ కు కేసీఆరే సాటని అంటారు. హుజూరాబాద్ ఓటమి మొదలు ఆయన అనేక సందర్భాలలో ప్రదర్శించిన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సాగుతున్న కేంద్రం పై యుద్ధం, జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటనలు, యాత్రలు అన్నీ కూడా అదే కోవలోకి వస్తాయని వేరే చెప్పనక్కర లేదని ఎప్పటి నుంచో రాజకీయ పండితులు చెపుతూనే ఉన్నారు. అలాగే, వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా చిక్కులు వచ్చిన సందర్భాలలో ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య, లేదా కేంద్రం రాష్ట్రం మధ్య అనవసర వివాదాలు సృష్టించడం, తద్వారా సెంటిమెంట్’ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కూడా కేసీఆర్ స్కూల్ పాలిటిక్స్’లో భాగంగానే ఉంటూ వస్తోందని అంటారు. ఈ విద్యలో ఇంతవరకు శ్రీ కేసీఆర్ ఒక్కరే సిద్దహస్తులన్న పేరుంది. కానీ ఇప్పుడు కేసీఆర్’కు కేజ్రివాల్ పోటీకి వచ్చారని అంటున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వాగ్దానాలు, చెప్పుకుంటున్న గొప్పలను పక్కన పెడితే, పంజాబ్’ లో ఎన్నికల సందర్భంగా చేసిన ఏ ఒక్క వాగ్దానం ఇంత వరకు అమలు కాలేదు. నిజమే, పంజాబ్’లో ఆప్ అధికారంలోకి వచ్చి ఇంకా నిండా నెల రోజులు అయినా కాలేదు. ఇంతలోనే అంత తొందరైతే ఎలా, అని అనవచ్చును కానీ, అరవింద్ కేజ్రివాల్ ఆప్ అధికారంలోకి వచ్చిన వెంటనే 300 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తామని వాగ్దానం చేశారు. అంతే కాదు, మార్చి నెలలో 300 యూనిట్లకు తక్కువ విద్యుత్ వినియోగించిన గృహవినియోగాదారులకు ఏప్రిల్ నెలలో బిల్లులే రావని ఎన్నికల ప్రచారంలో ప్రతి వేదిక నుంచి ప్రకటించారు. కానీ, ఏప్రిల్ నెలలో యథావిధిగా 300 వందలు కాదు, 100 యూనిట్లు అంతకు తక్కువ వినియోగించిన వినియోగదారులకు కూడా బిల్లులు వస్తూనే ఉన్నాయి. అలాగే, ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామన్నా వాగ్దానం విషయంలోనూ ఉలుకు పలుకు లేదు.
నిజానికి పంజాబ్ అప్పుల్లో కురుకు పోయిందనే విషయం ఎన్నికలకు ముందు కూడా అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం అప్పు మూడు లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారిక లెక్కలే చెపుతున్నాయి. ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించి, ఇంతలా అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రంలో ఇన్నేసి ‘ఉచిత’ పథకాలను ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు కేజ్రీవాల్, అందుకు తమ వద్ద మంత్ర దండం ఎదో ఉందనే విధంగా సమాధానం ఇచ్చారు. కానీ, ఎన్నికల తర్వాత మంత్ర దండం ఏమైందో ఏమో కానీ, ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్’ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ముందు చేయి చాచారు. అప్పుల చిట్టా విప్పి, రాష్ట్రాన్ని అప్పుల గండం నుంచి గట్టెక్కించేందుకు జస్ట్’ ఓ లక్ష కోట్ల రూపాయలు ఇచ్చుకోమని వేడుకున్నారు. కేంద్రం ఎటూ అంత మొత్తం ఇవ్వదు కాబట్టి, కేసీఆర్’ బాటలో మాన్. కేంద్రం మీద కత్తులు దూస్తారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కేజ్రీవాల్, కేసీఆర్ సార్’ ను ఫాలో అయి పోతున్నారు.
ఇదొకటే కాదు, కేసీఆర్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు అయినా, ఈ ఎనిమిది సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అనవసర వివాదాలు సృష్టించి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన విధంగా, కేజ్రీవాల్ కూడా, పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని విషయాన్ని తెరమీదకు తెచ్చారు. ఎప్పుడో 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హర్యానా, పంజాబ్ నుండి విడిపోయింది. ఆ సమయంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో నిర్మించిన ఏకైక నగరం చండీగఢ్ కావడంతో, అప్పటి కేంద్ర ప్రభుత్వం చండీగఢ్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచి చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం చండీగఢ్ ఉద్యోగులకు కేంద్రం నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చండిఘడ్‌ను తమకు బదిలీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం చండీగఢ్’ను ఉమ్మడి రాజధానిగ కొనసాగించాలని తీర్మానం చేసింది. నిజానికి ఇదేమంత చిక్కు సమస్య కాదు, కానీ, కేజ్రీవాల్ డైరెక్షన్’లో ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు వెయ్యి రూపాయాల ఉచిత నజరానా వంటి ఉచిత వరాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, ఉమ్మడి రాజధాని విషయాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేజ్రీవాల్ , కేసీఆర్ మధ్య చాలా విషయాల్లో సారుప్యత ఉందని రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.


