అచ్చెన్నాయుడు ఆరోగ్యం పై కమిటీ వేసిన ప్రభుత్వం

ఈఎస్‌ఐ అవినీతి వ్యవహారంలో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఆయనకు విధించిన మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జూన్ 30 వరకు కోర్టు మూసి ఉంచిన కారణంగా విచారణను జూలై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

ఇది ఇలా ఉండగా అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక వైద్యుల కమిటీని నియమించింది. ఏసీబీ అదుపులోకి తీసుకున్న తరువాత అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై అటు పార్టీ నేతలు, ఇటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో కూడిన ఒక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆయనకు వైద్యం చేసిన సిబ్బందిని విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వనుంది.