అందుకే పవన్ ఓడిపోయాడు.. ఇలాంటివి బయటికి తెలియవు

 

సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆయనే తేల్చుకోవాలని.. వాళ్ల ఇంట్లో ఏం వండుకుంటున్నారు? ఏ కాఫీ పెడుతున్నారు? అనేది ఇక అనవసర విషయం అని పృథ్వీ అభిప్రాయపడ్డారు. పసుపు-కుంకుమ ఆదుకుంటుందని, 90 లక్షల మంది మహిళలు ఓట్లేస్తారని చంద్రబాబు నమ్మారని, కానీ ప్రజలు 'బైబై బాబు' అంటూ వీడ్కోలు పలికారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువైన తరుణంలో కూడా ఇంకా చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇకమీదట టీడీపీలో ఏం జరుగుతుంది? వాళ్ల కార్యాచరణ ఏమిటి? వంటివన్నీ కూడా వాళ్లకు సంబంధించిన విషయాలే తప్ప తాము మాట్లాడ్డానికి ఏమీలేదని పృథ్వీ స్పష్టం చేశారు.
 
ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణమని పృథ్వీ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేత కన్నబాబుపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పృథ్వీ స్పందించారు. కన్నబాబు గతంలో చిరంజీవి వద్ద పీఆర్వోగా పనిచేశారని, ఆ అభిమానంతోనే కన్నబాబుకు ప్రజారాజ్యంలో అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కన్నబాబును తరిమికొట్టండి, తాటతీయండి అని పవన్ వ్యాఖ్యానించడంపై కాపు సామాజిక వర్గంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. మనోడ్ని మనోడే తిట్టడం ఏంటని తూర్పుగోదావరి ప్రజలు చర్చించుకున్నారని, ఇలాంటివి బయటికి తెలియవని వివరించారు. అయినా, పీఆర్వోగా పనిచేసిన వ్యక్తి అంతటితో ఆగిపోవాల్సిందేనా? రాజకీయాల్లో ఎదగకూడదా? అని ప్రశ్నించారు.