ఇండియన్స్.. ఇరాన్ నుంచి వచ్చేయండి.. కేంద్రం ప్రకటన
Published on: Fri Jan 16, 2026 10:17AM

ఇరాన్ లో నివసిస్తున్న ఇండియన్స్ అందరూ వెంటనే వెనక్కు వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఇరాన్ లో భారతీయులు ఎవరూ ఉండొద్దు, వెంటనే వెనక్కు వచ్చేయాలనీ, అక్కడ ఉన్న ఇండయన్స్ ను వెనక్కు తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నామనీ పేర్కొంది. ఇరాన్ ముస్లిం దేశమే అయినప్పటికీ, సాంకేతికత, వైద్య విద్య తదితర అంశాలలో ముందంజలో ఉండటంతో భారత్ నుంచి అనేక మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసించేందుకు వెడుతుంటారు. ఇక నిర్మాణ రంగంలో పని చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఇరాన్ వెడతారు.
కానీ ఇటీవల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది. దీంతో అక్కడ ఆహార పదార్థాలు సహా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భయం కూడా ఉండటంతో ఇరాన్ ఇతర దేశాలకు చెందిన వారిని పనుల్లో నియమించరాదని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి. లక్షలాది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను విధ్వంసానికి దారి తీస్తున్నాయి. దీంతో నిరసనకారులపై ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తోంది.
ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇరాన్ నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ 12 వేల మందికి పైగా నిరసన కాల్పుల్లో హతమయ్యారు ఇక అమెరికా రంగంలోకి దిగి నిరసనకారులకు మద్దతు ప్రకటించింది. తద్వారా దేశంలో హింసను రెచ్చగొట్టేలా ప్రకటనలు గుప్పిస్తోంది. నిరసనలు కొనసాగించాలనీ, నిరసనకారులకు పూర్తి సహకారం అందిస్తామనీ, భద్రత కల్పిస్తామని అగ్రదేశాధినేత ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ లో సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో, ఆ దేశంలో ఉన్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారతీయులందరూ వెంటనే స్వదేశానికి వచ్చేయాలని పిలుపునిచ్చింది. ప్రత్యేక విమానాల ఏర్పాటు షెడ్యూల్ ను నేడో, రేపో ప్రకటించనుంది.


