పాడేరులో ముమ్మరంగా రంగురాళ్ళ తవ్వకాలు
Published on: Sat May 5, 2012 12:35PM
విశాఖజిల్లాలో కొద్దిరోజుల క్రితం రంగురాళ్ళ అక్రమక్వారీ కూలిపోవటంతో ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ సందర్భంగా క్వారీలను నిరోధిస్తామంటూ అధికారులు హడావుడి చేసి ఆ తరువాత అదృశ్యమయిపోయారు. కానీ, రంగురాళ్ళ తవ్వకాలు మాత్రం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాడేరు మండలం మినుములూరు పంచాయితీ పరిథిలోని కోడిగుడ్ల గ్రామసమీపాన ఉన్న కొండపై గత రెండువారాలుగా అక్రమంగా రంగురాళ్ళను తవ్వుతున్నారు.
ఈ తవ్వకాల్లో వ్యాపారులకు మూన్ స్టోన్ అనే విలువైన రాయి దొరకటంతో తవ్వకాలను మరింత ముమ్మరం చేశారు. క్వారీకొండపై నుంచి 20 అడుగుల మేర సోరంగంగా తవ్వి రాళ్ళను వేరు చేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా వర్షాలు పడితే ఈ సొరంగ ప్రాంతమంతా కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసినా వ్యాపారులు అమాయక గిరిజనంతో క్వారీ పనులు చేయిస్తున్నారు. గత పదిహేను రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నా అటవీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు పట్టించుకోవటం లేదు. దీనికి తోడు ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచారిస్తున్నారని తెలియటంతో అధికారులు ఎవరూ ఆ గ్రామసమీపానికి వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. దీన్ని సాకుగా తీసుకుని ఇక్కడ రాత్రీ పగలూ అనే భేదం లేకుండా రంగురాళ్ళను తవ్వేస్తున్నారు.


