కేరళలో అలర్ట్.. స్టూడెంట్‌కు నిఫా వైరస్
Published on: Tue Jun 4, 2019 11:27AM

కేరళలోని ఎర్నాకుళంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ధ్రువీకరించింది. ఈ విద్యార్థి నిఫా లక్షణాలతో కోచిలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేరాడు. రోగ నిర్ధారణ పరీక్షలో వైద్యులు అతనికి నిఫా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి ఇడుక్కిలోని తోడుపుళాలోని కాలేజీలో చదువుతున్నాడు. ఇటీవల ఓ క్యాంప్ నిమిత్తం త్రిశూర్ వెళ్లి నాలుగు రోజుల పాటు ఉన్నాడు. ఆ సమయంలోనే అతడికి జ్వరం వచ్చింది. క్యాంప్ నుంచి తిరిగొచ్చాక కూడా జ్వరం తగ్గకపోవడంతో తాజాగా కోచిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు నిఫా వైరస్‌లాగా ఉండటంతో అనుమానించిన వైద్యులు అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపించారు. ఈ నమూనాలను పరిశీలించిన ఎన్‌ఐవీ.. అతడికి నిఫా సోకినట్లు నిర్ధారించింది.
కాగా.. మరో నలుగురు వ్యక్తులు కూడా నిఫా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. నిఫా సోకిన 23ఏళ్ల విద్యార్థికి వీరు చికిత్స అందించినట్లు తేలింది. దీంతో చర్యలు చేపట్టిన ఆసుపత్రి సిబ్బంది వీరిని ప్రత్యేక వార్డులో ఉంచారు.
అయితే దీనిపై ప్రజలు కంగారు పడాల్సింది ఏమీ లేదని, నిఫా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఎర్నాకుళం, త్రిశూర్, కోజికోడ్ జిల్లాలో నిఫాపై అలర్ట్ ప్రకటించామని వెల్లడించారు. రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.
గతేడాది మే నెలలో కేరళలో నిఫా వైరస్ కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిఫా లక్షణాలతో కోజికోడ్‌లో 14 మంది, మలప్పురంలో ముగ్గురు మృతిచెందారు. నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత రోగికి దగ్గరగా ఉండేవారికి వస్తుంది. అలా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వల్ల తొలి దశలో తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి కలుగుతుంది. తర్వాత శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తుతుంది.


