కలెక్టర్ గారు మీరు గ్రేట్

 

గతంలో పిల్లల్ని అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవారు. కానీ ఈ రోజుల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎవరి పిల్లల్నైనా ప్లేస్కూల్లో,ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం భారత నాగరిక విధానంలో ఒక భాగమైంది. పట్టణాలు సమీపంలో లేకపోవడం లేదంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు మాత్రమే తమ పిల్లల్ని అంగన్‌వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అందుకే చాలా గ్రామాల్లో అంగన్‌వాడీలు,పాఠశాలలు బోసిపోయి కనిపిస్తుంటాయి. అయితే తమిళనాడుకు చెందిన ఓ కలెక్టర్ ఆధునిక పోకడలకు భిన్నంగా ఆలోచించి తన కూతురిని అంగన్‌వాడీలో చేర్పించారు.


తిరునల్‌వెలి జిల్లా కలెక్టర్‌గా శిల్పా ప్రభాకర్ సతిష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తన చిన్నారిని ప్లేస్కూల్‌కు పంపించకుండా పలయంకొట్టాయ్ అంగన్‌వాడీలో చేర్పించారు. అయితే ఈ విషయమై శిల్పా స్పందిస్తూ ‘‘ఏమీ అనుకోవద్దు. మేం కర్ణాటక వాసులం. అయితే నా కూతరు అంగన్‌వాడీలో చిన్నప్పటి నుంచే తమిళ్ నేర్చుకుంటుండటం ఆనందంగా ఉంది. నా కూతరు అన్ని రకాల సమూహాల ప్రజలతో కలిసి మమేకం కావాలి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని అన్నారు. ఈ అంగన్‌వాడీ కలెక్టరేట్‌కు సమీపంలోనే ఉంది. అన్ని వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక స్థోమతగా అంతగా లేని నిరుపేదల పిల్లలే అంగన్‌వాడీల్లో చదువుతారనే భావనను తొలిగించేందుకు ఆమె చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.