క్షేమంగా తిరిగొచ్చిన కోబ్రా కమాండో 

కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా తిరిగొచ్చారు. ఛత్తిస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో  విముక్తి కలిగింది. 5 రోజులుగా తమ దగ్గర బందీగా ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ ను  మావోయిస్టులు విడిచిపెట్టారు. మావోయిస్టుల బందీ నుంచి బయటపడిన కోబ్రా కమాండో బెటాలియన్ కు రానున్నారు. 

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. నక్సలైట్లు రాకేశ్వర్‌సింగ్‌‌ను బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. మధ్యవర్తుల పేర్లు చెప్పాలని కోరారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. 

అయితే మావోయిస్టుల డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగానే ఉన్నాయి. మావోయిస్టులు తమ అధీనంలో కి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌ను  వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని కోరాయి. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.