బొగ్గు కుంభకోణం కేసు.. మాజీ సీఎంకు జైలుశిక్ష...

 

జార్ఖండ్ బొగ్గు కుంభకోణం కేసు విషయంపై ఎప్పటినుండో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజు  ఢిల్లీలోని సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మధు కోడాతో పాటు.. కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సి గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా.. జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎకె బసుకి మూడేళ్ల జైలు శిక్ష, కోల్ కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ... కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, జార్ఖండ్ లోని ఉత్తర రాజ్ హరా బొగ్గు క్షేత్రాన్నివిసుల్ సంస్థకు జార్ఖండ్ ప్రభుత్వం కేటాయించింది. కానీ, నాటి బొగ్గు శాఖ కార్యదర్శి గుప్తా ఆధ్వర్యంలోని 36వ ఎంపిక సంఘం సిఫార్సు చేసింది. ఈ కుంభకోణంలో మధు కోడా, ఎకె బసుతో పాటు ఇతర అధికారులు కుమ్మక్కైనట్టు సీబీఐ పేర్కొని కేసు నమోదు చేసింది.