బొగ్గు కుంభకోణాలకు నిండు నూరేళ్ళ ఆయుష్షు

 

పదేళ్ళ యూపీయే అవినీతి పాలనకు అద్దం పట్టే అనేక కుంభకోణాలలో కోల్ గెట్ (బొగ్గు కుంభకోణం) కూడా ఒకటి. అయితే దీనికి 20 ఏళ్ల ఘన చరిత్ర ఉందని నిన్న సుప్రీం కోర్టు తేటతెల్లం చేసింది. అప్పటి నుండి దేశాన్ని ఏలిన అన్ని ప్రభుత్వాలకు ఈ బొగ్గు మసి అంటిందనే విషయాన్ని కూడా కోర్టు దృవీకరించింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రాణాధారమైన బొగ్గు గనుల కేటాయింపులలో 1993నుండి అవకతవకలు, నియమ నిబంధనల ఉల్లంఘనలు, అవినీతి యదేచ్చగా సాగుతోందని కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు గనుల కేటాయింపులను ఖరారు చేసే స్క్రీనింగ్ కమిటీ ఏనాడూ కూడా పారదర్శకంగా పని చేయలేదని కూడా స్పష్టం చేసింది.

 

ప్రభుత్వాలను రాజకీయ పార్టీలు నడిపిస్తుంటే, వాటిని రాజకీయ నాయకులు, వారిని బడా పారిశ్రామిక వేత్తలు నడిపిస్తున్నారనే విషయం ఎవరికీ తెలియనిది కాదు. కనుక ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు మధ్య ఉండాల్సిన సన్నటి గీతను రాజకీయ నాయకులు చెరిపేసిన తరువాత ప్రభుత్వాలపై బడా పారిశ్రామికవేత్తల పెత్తనం క్రమంగా పెరిగిపోయినందునే ఇటువంటి అక్రమాలు యదేచ్చగా సాగిపోతున్నాయి.

 

అటువంటి అక్రమార్కులను, వారికి తోడ్పడుతున్న ప్రభుత్వాలను దారిన పెట్టాల్సిన కోర్టులు కూడా ఇన్నేళ్ళుగా ఈ మసి తమకు అంటకుండా కళ్ళకు గంతలు కట్టుకొని చూసీ చూడనట్లు ఉండిపోవడానికి కారణం మన న్యాయవ్యవస్థపై కూడా చాలా రాజకీయ ఒత్తిళ్ళు ఉండటమేనని చెప్పక తప్పదు. హైకోర్టు జడ్జీల నియామకాల విషయంలో సుప్రీం కోర్టు కొలేజియం వ్యవస్థపై కూడా రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గిందని ప్రెస్ ట్రస్ట్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆరోపించడం, దానిపై స్పందించిన మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టు కొలేజియం వ్యవస్థ సమూల ప్రక్షాళనకు రెండు కొత్త చట్టాలను పార్లమెంటు చేత ఆమోదింపజేయడం మన న్యాయవ్యవస్థలో లోపాలను కళ్ళకు కట్టి చూపుతోంది. కానీ యావత్ దేశ ప్రజలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుప్రీం కోర్టే చొరవ తీసుకొని పూనుకోవడంతో ఈ అవినీతి గనుల వ్యవహారం బయటపడింది.

 

సుప్రీం కోర్టు ఈ బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టి తన పని అయిపోయినట్లు చేతులు దులుపుకోకుండా, 1993 నుండి వివిధ పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు ఇంతవరకు జరిగిన ప్రతీ అక్రమ కేటాయింపులను క్షుణ్ణంగా పరిశీలించి, వారి వలన దేశానికి జరిగిన నష్టం కనుగొనేందుకు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కూడిన ఒక విచారణ కమిటీని నియమించాలని భావిస్తోంది.

 

బొగ్గు గనుల కేటాయింపులో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా సుప్రీం కోర్టే దృవీకరించింది. కనుక ఇక ఆ అవినీతికి పాల్పడిన వారందరిపై కటిన చర్యలు తప్పవని, వారు గనుల నుండి బొక్కేసిన దేశ సంపదను అణాపైసలతో సహా కక్కించబడుతుందని ఎవరయినా అనుకొంటే అది అమాయకత్వమే అవుతుంది. ఇటువంటి అవినీతి భాగోతాలను ఏ విధంగా అటకెక్కించాలో ప్రభుత్వాలను నడుపుతున్న మన రాజకీయ నాయకులకు, వారిని వెనక నుండి నడిపించే బడా బాబులకు బాగా తెలుసు. పశువుల దాణా కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఓబులాపురం గనులను అక్రమంగా త్రవ్వుకొన్న యెడ్యూరప్ప, బళ్ళారి గనుల అక్రమార్కుడు గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారు అనేకమంది సంకీర్ణ ప్రభుత్వాల పుణ్యామాని ఎటువంటి శిక్ష అనుభవించకుండా, ఎటువంటి నష్ట పరిహారం చెల్లించకుండా, నేడు హాయిగా వ్యాపారాలు చేసుకొంటూ మళ్ళీ రాజకీయాలలో కూడా చక్రం తిప్పడం చూస్తుంటే, ఈ వ్యవహారం కూడా ఇలాగే కొన్నేళ్ళు సాగి చివరికి ఈ కేసులు కూడా కూడా ఇతర కేసుల లాగే ఏదోరోజున అటకెక్కడమో లేక ఏదోరోజు నిందితులు చనిపోయాక వారిపై కేసులు మూసివేయడమో జరిగే అవకాశం ఉంది. అందువలన ఈ బొగ్గు కుంభకోణానికి కూడా ఇతర కుంభకోణాలలగే నిండు నూరేళ్ళ ఆయుష్షు అని దీవించక తప్పదు.