సాక్షాత్తు సీఎం కూతురికే టోకరా ఇచ్చిన సైబర్ కేటుగాడు
Published on: Tue Feb 9, 2021 9:18AM
సైబర్ నేరగాళ్లున్నారు తస్మాత్ జాగత్త.. పారాహుషార్ అంటూ అటు సైబర్ పోలీసులు, ఇటు నిపుణులు హెచ్చరిస్తున్నా విద్యావంతులు కూడా మోసపోతూనే ఉన్నారు. తాజాగా సాక్షాత్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితకు ఓ సైబర్ కేటుగాడు టోకరా వేసాడు. సీఎం కుమార్తె అయిన హర్షిత తన సెకండ్ హ్యాండ్ సోఫాను ఆన్లైన్లో విక్రయిస్తుండగా,.. ఒక సైబర్ నేరస్తుడు ఆన్లైన్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.34 వేలను మోసం చేసి మరీ తన అకౌంట్ లోకి వేసుకున్నాడు. దీంతో ఈ మోసంపై సీఎం కుమార్తె హర్షిత ఢిల్లీలోని సివిల్ లైన్సు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం కుమార్తె విక్రయానికి పెట్టిన సోఫాను కొంటానని ఒక కస్టమర్ గా వచ్చిన సైబర్ నేరగాడు ముందుగా ఆమె బ్యాంకు ఖాతాలోకి కొంత డబ్బు ట్రాన్స్ ఫర్ చేసాడు. తర్వాత ఒక బార్ కోడ్ పంపి దాన్ని స్కాన్ చేయమని ఆమెను కోరాడు. హర్షిత ఆ బార్ కోడ్ స్కాన్ చేయగానే ఆమె బ్యాంకు అకౌంట్ నుండి 20వేలరూపాయలు డెబిట్ అయ్యాయి. ఐతే పొరపాటున తప్పు బార్ కోడ్ పంపించానని, మరో బార్ కోడ్ పంపించి దీన్ని స్కాన్ చేస్తే సోఫా డబ్బు మీ అకౌంట్ లో పడుతుందని నమ్మబలికాడు. దీంతో రెండోసారి బార్ కోడ్ స్కాన్ చేయగానే మరో సారి 14వేల రూపాయలు హర్షిత ఖాతా నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో తానూ మోసపోయానని గ్రహించిన హర్షిత ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి మోసం చేసి, సీఎం కుమార్తె బ్యాంకు అకౌంట్ లోనుంచి డబ్బు కాజేసిన ఆ కేటుగాడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.


