TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవి కాంగ్రెస్ తో అడుకుంటున్నారా ?

Published on: Sat Jan 21, 2012 9:41AM

హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన ఆపద్బాంధవుడు చిరంజీవి కాంగ్రెసు నాయకత్వంతో ఆడుకుంటున్నారా అనే సందేహం కలుగుతోంది.అయితే, ఆయన తీరు చూస్తుంటే పూర్తి స్థాయి కాంగ్రెసు నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు.తన పార్టీని కాంగ్రెసు పార్టీలో ఓ ప్రత్యేక వర్గంగా కాపాడుకుంటూ తన డిమాండ్లను సాధించుకునే రాజకీయాలను ఆయన ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన ఆయన తన వాటా కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. మంత్రి పదవులు ఇప్పించుకోవడంలోనే కాకుండా వివిధ విషయాల్లో ఆయన తీరు రాను రాను కాంగ్రెసు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా పరిణమించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.కాంగ్రెసు అధిష్టానానికి విధేయుడిగా కనిపిస్తూనే తన కోరికలను నెరవేర్చుకునేందుకు ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి తాను మాత్రమే దిక్కు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు పార్టీని కాపాడేందుకు తాను తప్ప మరొకరు పనికి రాబోరని, అందువల్ల తన ప్రాబల్యం కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న ఉప ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి కోరికలను తీర్చడానికి అధిష్టానం ముందుకు వస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి, ఆయన వర్గం వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకుడిగా కాకుండా భాగస్వామ్య పక్షం నాయకుడిగా, అంటే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగానే చిరంజీవి వ్యవహరిస్తున్నారని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి కాంగ్రెసు రాజకీయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయడం వల్లనే తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది.