అసెంబ్లీలో బాబు వర్సెస్ జగన్.. హోదాపై మాటల యుద్ధం!!

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరపున హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా’’ అని జగన్‌ తెలిపారు.

ఈ విషయమై మాజీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని స్పష్టం చేశారు. 2014 మార్చిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని.. హోదా ఇవ్వాలని  తాము ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. హోదాను  ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పేరు మార్చాం కానీ.. హోదాతో వచ్చే లాభాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  దీంతో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా చంద్రబాబు తెలిపారు.

ఫైనాన్స్ కమిషన్ మాత్రం ప్రత్యేక హోదా పేరుకు ఒప్పుకోలేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు హోదాకు బదులుగా ప్యాకేజీ పేరు పెట్టారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ 29సార్లు ఢిల్లీకి వెళ్లానని.. రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం చేశామని ఆయన చెప్పారు. 

ప్రత్యేక హోదా కోసం తాను సిన్సియర్‌గా పోరాటం చేసినట్టుగా  చంద్రబాబు చెప్పారు. ప్లానింగ్ కమిషన్‌కు వెళ్లి  ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పడం సరైంది కాదన్నారు. మీకు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ను చంద్రబాబు కోరారు.  తనపై బురద చల్లితే ఏపీకి ప్రత్యేక హోదా రాదని  ఆయన అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు ప్రసంగానికి జగన్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు ఒక్క లేఖ కూడ రాయలేదన్నారు.  చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చే వరకు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయని విషయాన్ని జగన్ గుర్తు చేశారు.