రెండేళ్లు టైం ఇవ్వండి.. ప్రభుత్వ పాఠశాలలంటే ఏంటో చూపిస్తాం!!

 

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట' కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని అక్షరాలు దిద్దించారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో ‘రాజన్న బడిబాట' నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం చేయించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ' అని జగన్ అన్నారు.

'ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను ప్రతీ తల్లి, చెల్లికి ఇక్కడి నుంచి ఒకేఒక మాట చెబుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడికి పంపండి. ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. బడికి పంపించినందుకు వచ్చే ఏడాది జనవరి 26 నాటికి ఏపీ పండుగదినం చేస్తాం. జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం’ అని జగన్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా తయారు అయ్యాయి కాబట్టే ఏ తండ్రి, తల్లి అయినా తమ పిల్లలను గవర్నమెంటు పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. 'అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఎల్ కేజీలో చేర్పించాలంటే రూ.20,000 అడుగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో అయితే రూ.40,000 తీసుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలను చదవించుకోవాలంటే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మార్చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నా. నేను ప్రజలను 2 సంవత్సరాల సమయం అడుగుతున్నాను. ఈ రెండేళ్లలో స్కూళ్లను అభివృద్ధి చేసి చూపిస్తాను. పాఠశాలల్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తాం.’ అని జగన్ భరోసా ఇచ్చారు.