TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేడారంలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 868 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!

Published on: Sun Aug 16, 2026 3:52PM

 

సీఎం రేవంత్ రెడ్డి  ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం క్షేత్రానికి చేరుకుని వనదేవతలైన సమ్మక్క-సారలక్క గద్దెలను దర్శించుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మేడారం గద్దెల పరిసరాల్లో జరుగుతున్న విస్తరణ, సౌకర్యాల కల్పన పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. జాతర ప్రాంగణంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' పథకంలో భాగంగా నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను స్వయంగా అందజేశారు.

మేడారానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), మంత్రి పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ లతో పాటు ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు  అధికారులు ఘన స్వాగతం పలికారు.

అమ్మవార్ల దర్శనం ముగించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ములుగు గట్టమ్మ ఆలయం వద్దకు చేరుకుని తెలంగాణ వ్యాప్తంగా నిర్మిస్తున్న హ్యామ్ రహదారుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో భాగంగా సుమారు 3 వేల గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. మొత్తంగా ములుగు జిల్లా ప్రగతి కోసం దాదాపు రూ.868 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు  ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ విస్తృత పర్యటన సాగుతోంది. గిరిజన సంక్షేమంతో పాటు మారుమూల ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం.

ఈ భారీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ములుగు ప్రాంత రూపురేఖలు మారనున్నాయని, రాబోయే రోజుల్లో మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన శాశ్వత మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy, Medaram Sammakka Sarakka,  Mulugu Development Works, Cheyutha Pensions Telangana, TeluguOne