TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎస్‌ఆర్ నిధులు తెలంగాణకే ఖర్చు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Published on: Thu Mar 26, 2026 9:30PM

 

హైదరాబాద్‌లోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేయడంపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి లాభాలు పొందుతున్న సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధులను తెలంగాణలోనే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. “తెలంగాణలో వ్యాపారం చేసి, నిధులను వేరే చోట ఖర్చు చేస్తే ఎలా?” అంటూ ప్రశ్నించారు.

ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన సీఎస్‌ఆర్ నిధులు తగిన స్థాయిలో లేవని, వాటిని మరింతగా ఆకర్షించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎస్‌ఆర్ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, వాటి సమర్థ వినియోగం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాలని సూచించారు. సంస్థలతో సమన్వయం కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న సీఎస్‌ఆర్ విధానాలను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు కనీసం 50 శాతం సీఎస్‌ఆర్ నిధులను రాష్ట్రంలోనే ఖర్చు చేసేలా విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.అలాగే, రాష్ట్రంలో అత్యధికంగా సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేస్తున్న సంస్థలను గుర్తించి ప్రభుత్వం తరపున సత్కరించాలని నిర్ణయించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రైవేట్ రంగం నుంచి మరింత సహకారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.