కిరణ్ కూడా రాష్ట్ర విభజనకు సిద్దపడినట్లేనా

 

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఉద్యోగుల చేత సమ్మెవిరమింపజేసే బాధ్యత ముఖ్యమంత్రిదేనని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పిన మరునాడే కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మరో మారు మీడియా ముందు తన సమైక్య రాగం ఆలపించారు.

 

రాష్ట్ర విభజన వల్ల కలిగే సమస్యలను చర్చించకుండా కేంద్రం హడావుడిగా విభజన చేయడం వల్ల మరికొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, ఇప్పటికయినా ప్రజల ఆందోళనలు గమనించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన అధిష్టాన్నాన్నికోరారు. ముఖ్యమంత్రే స్వయంగా వెనుక నుండి ఉద్యోగుల సమ్మెను ప్రోత్సహిస్తున్నరనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. వారు తమ జీతాలను కోల్పోతున్నాపట్టుదలగా ఉద్యమం చేస్తున్నారని మెచ్చుకొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలోఉంచుకొని ఇకనయినా ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

 

టీ-నోట్ ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రకటన వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందిస్తారని అందరూ భావించారు. కానీ ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం మృదువుగా మాట్లాడటం విశేషం. బహుశః ఇక తను కూడా రాష్ట్ర విభజన ఆపలేనని గ్రహించినందునే ఆయన కొంచెం వెనక్కి తగ్గినట్లున్నారు. అదేవిధంగా ఇంతవరకు చాలా గట్టిగా సమైక్యవాదం వినిపించిన అనేకమంది మంత్రులు, శాసన సభ్యులు కూడా పూర్తిగా చల్లబడిపోయినట్లే ఉన్నారు. ఇక పరిస్థితి అంతా చల్లబడేవరకు కేంద్ర మంత్రులు,యంపీలు తమ రాజీనామా డ్రామాలు కొనసాగిస్తూనే ఉంటారని వేరే చెప్పనవసరం లేదు.

 

ఇక మిగిలింది ఉద్యోగులు. వారిని మానసికంగా దెబ్బ తీసి వారి ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు ఇప్పటికే చాలామంది మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన అన్ని విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒకసారి ఉద్యోగులు వెనక్కి తగ్గినట్లయితే ఇక రాష్ట్ర విభజన ప్రక్రియలో అందరూ తలో చేయివేసి త్వరగా పనికానిచ్చేయడం ఖాయం. ఎందుకంటే ఆ తరువాత రాజధాని నిర్మాణం కోసం బోలెడు కాంట్రాక్టు పనులుంటాయి మరి.