అవును, నేను సమైక్యవాదినే!

posted on: Sep 27, 2013 11:15PM

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మరోమారు సమైక్యవాదం బలంగా వినిపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈసారి నేరుగా దిగ్విజయ్ సింగ్ ను కూడా విమర్శించారు.

 

“ఈమధ్య దిగ్విజయ్ సింగ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. అవును, నేను ఖచ్చితంగా సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినే! ఆయన అలా అన్నప్పుడల్లా నాలో సమైక్యవాదం మరింత బలపడుతుంది. నేను, ఆయన కూడా మా పదవులలో శాశ్వితంగా ఉండబోము. నాకు నా పదవి కంటే, నా రాజకీయ భవిష్యత్ కంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యం. అందుకే రాష్ట్రం విడిపోకూడదని కోరుకొంటున్నాను. నేను సోనియా గాంధీ దిక్కరించాలనో లేక అధిష్టానం మీద కోపంతోనో ఈవిధంగా మాట్లాడటం లేదు. కేవలం సమస్యలని పరిష్కరించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మాత్రమే చెపుతున్నాను."

 

"నాకు సోనియా గాంధీ వల్లే ఈ పదవి వచ్చిన సంగతిని ఎన్నడు మరిచిపోను. కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పడు ఆ పదవి వదులుకొని జీవితాంతం మాజీ ముఖ్యమంత్రిగా నిలిచిపోవడానికి కూడా నేను సిద్ధం, “ అని ముఖ్యమంత్రి అన్నారు.

 

“రాష్ట్ర విభజనకు నిర్ణయం ప్రకటించిన నాటి నుండి ఇంతవరకు నేను లేవనెత్తిన ఏ ఒక్క అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని భావించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేని విధంగా గట్టి చిక్కుముళ్ళు అనేకం వేసి ఏర్పాటు చేసారు. గనుక రాష్ట్ర విభజన అంత తేలిక కాదు. అందుకే ఇందిరా గాంధీ కూడా ఏనాడు ఇటువంటి ఆలోచనలు చేయలేదు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనం అయినట్లయితే, మరి నెహ్రూ, ఇందిరల నిర్ణయాలు అటువంటివి కావా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.”

 

నీళ్లు బాగా వచ్చినప్పుడు ఏ సమస్యా లేదు, నీళ్లు లేనప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుంది, రాష్ట్రం విడిపోతే జలయుద్ధాలు తీవ్రమవుతాయి. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగుల ప్రమోషన్ల పైనా, సీనియారిటీపైనా వాటి ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పించను ఎలా ఇస్తారన్నది కూడా ఇప్పటివరకూ కేంద్రం చెప్పలేకపోయిందని, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏవిధంగా పరిష్కరించగలదో కేంద్రమే చెప్పాలని ఆయన అన్నారు.

 

ఉద్యోగుల సమ్మెతో వారు వారి కుటుంబాలే కాక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువలన వెంటనే సమ్మె విరమించాలని ఆయన ఉద్యోగులకు విజ్ఞప్తి చేసారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...