ఆ పుస్తకాల్లో ఏముందో?

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రుల బృందం ముందు ఎప్పటిలాగానే తన సమైక్య వాదనను వినిపించారు. ఢిల్లీ పెద్దలకు ఎప్పుడు చెప్పే మాటల్నే మళ్ళీ ఇంకోసారి చెప్పారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి రెండు పుస్తకాలను ఢిల్లీకి తీసుకెళ్ళి జీఓఎం సభ్యులకు ఇచ్చారు. జీఓఎంతో సమావేశం ముగిసిన తర్వాత బయటకి వచ్చిన ముఖ్యమంత్రి తాను జీఓఎంతో ఏం చెప్పిందీ మరోసారి ఏకరువు పెట్టారు.

 

ముఖ్యమంత్రి చెప్పిన విషయాల్లో కొత్త సంగతులేవీ లేవు. అయితే ముఖ్యమంత్రి తాను సమర్పించిన రెండు పుస్తకాల గురించి గానీ, అందులో ఏముందన్న విషయం గానీ బహిర్గతం చేయలేదు. ఆ పుస్తకాల్లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలే గణాంకాలతో సహా వున్నాయా, లేక మరేవైనా సీక్రెట్స్ దాగి వున్నాయా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి ఏదో కీలక అంశాలే ఆ పుస్తకాల్లో ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పే అంశాలున్నాయా.. లేక చాలామంది అనుమానిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అంతర్గతంగా విభజనకు మద్దతు పలుకుతూ సులభంగా విభజన జరగడానికి సహకరించే అంశాలను ఆ పుస్తకాల్లో పొందు పరిచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి తాను మంత్రుల బృందం ముందు వుంచిన అన్ని విషయాలనూ బహిర్గతం చేయాల్సిన అవసరం వుంది. ఈ విషయాన్నే పలువురు రాజకీయ నాయకులు ప్రస్తావిస్తూ ఆ పుస్తకాల్లో ఏమున్నదీ ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రం సమైక్యంగా వుండాలని నిజంగానే కోరుకుంటున్న పక్షంలో తాను సమర్పించిన పుస్తకాల్లో వున్న అంశాలను బహిర్గతం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.