ముఖ్యమంత్రి ఆఖరి బాల్ ఆడబోతున్నారా?

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు డిల్లీలో ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, యం.యల్యేలతో కలిసి మౌనదీక్ష చేసి, ఆ తరువాత రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి ఆయనకు విజ్ఞప్తి పత్రం అందించబోతున్నట్లు ద్రువీకరించబడింది. అయినా ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయంపై స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప మిగిలిన అందరు ఏదో రూపంగా దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. చివరికి ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకురాలుఅయిన సుష్మస్వరాజ్ కూడా ఈ దీక్ష గురించి మాట్లాడుతూ “తన ముఖ్యమంత్రినే అదుపులో పెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ మేము తన మాట వినాలని ఏవిధంగా భావిస్తోందో అర్ధం కావడం లేదు,” అని వ్యాఖ్యానించారు.

 

పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న కీలక సమయంలో, ముఖ్యమంత్రి స్వయంగా తన నిర్ణయాన్నివ్యతిరేఖిస్తూ డిల్లీలోనే దీక్షలు, ర్యాలీలకు పూనుకోవడం, రాష్ట్రపతిని కలిసి అందుకు అనుమతి ఈయవద్దని కోరాలనుకోవడం కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం క్రిందే లెక్కవస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావించవచ్చునేమో కానీ ప్రతిపక్షాలు, మీడియా మాత్రం ఆ విధంగా భావించబోవు.

 

 

ముఖ్యమంత్రి రేపు డిల్లీలో చేయబోయే దీక్ష వలన రాష్ట్ర విభజన ఆగకపోవచ్చు కానీ, అధిష్టానంపై మాత్రం తీవ్రమయిన ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రతిపక్ష పార్టీలు, జాతీయ మీడియా అందరూ కలిసి ఆయన దీక్షను ప్రస్తావించడం వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు గంగలో కలిసిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందునా కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశరాజధానిలో దీక్ష చేస్తే, కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్దంగా రాష్ట్ర విభజనకు పూనుకొంటోoదనే భావన దేశమంతా వ్యాపిస్తుంది.

 

  ఇప్పటికే బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. రేపటి నుండి నరేంద్ర మోడీతో సహా బీజేపీ నేతలందరూ ఇదేవిషయాన్ని తమ ఆయుధంగా చేసుకొని సభలలో ప్రముఖంగా ప్రస్తావించడం మొదలుపెడితే ఇక కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టం గురించి అంచనా వేయలేము.

 

అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం ఇక కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత మాత్రం ఉపేక్షించే అవకాశం లేదని భావించవచ్చును. కానీ, బహుశః ఆఖరు ప్రయత్నంగా ఆయనకు నయాన్నో భయాన్నోనచ్చజెప్పి దీక్షలు, ర్యాలీలు విరమింపజేసే ప్రయత్నాలు చేస్తోందేమో! కానీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి మొండిగా ముందుకే వెళ్ళదలిస్తే మాత్రం ఇక ఇదే ముఖ్యమంత్రిగా ఆయన ఆఖరు డిల్లీ యాత్ర కావచ్చును. అంతకంటే ముందే ఆయనను పదవిలోంచి తొలగించినా ఆశ్చర్యం లేదు.

 

పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన తన పదవిలో, పార్టీలో కొనసాగడం కూడా కష్టమే. అయితే, తనే స్వయంగా పదవి నుండి తప్పుకోవడం కంటే, పార్టీ చేతే వేటు వేయించుకొని బయటపడినట్లయితే, దానివలన సీమాంధ్రలో ప్రజల నుండి అపారమయిన సానుభూతి పొందవచ్చును. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తన పదవిని, పార్టీని తృణప్రాయంగా త్యజించినందుకు సమైక్య ఛాంపియన్ బిరుదు కూడా ఇక ఆయనకే ఖరారు అవుతుంది. ఒకవేళ ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమే అయి ఉంటే నేడో రేపో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం వేటువేసి, ఆయన స్థానంలో ఏ కన్నా లక్ష్మి నారాయణనో నియమించవచ్చును.

 

ఒకవేళ ఇంకా ఉపేక్షిస్తే అది కాంగ్రెస్ పార్టీకే కాక, ఆయనకీ రాజకీయంగా చాల నష్టం కలిగిస్తుంది. ఇంత హంగామా చేసిన తరువాత కూడా అయన ఇంకా తన పదవిలోనే కొనసాగితే ఆయన విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది గనుక, ఒకవేళ అధిష్టానం తనను పదవి నుండి తప్పించాకపోయినట్లయితే ఆయనే తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి, “సమైక్య త్యాగశీలి’ గా బయటకు వచ్చి తన కొత్త పార్టీకి రిబ్బన్ కటింగ్ చేసుకోవచ్చును.